
ఈస్టిండియా కంపెనీ గుర్తుందా? ‘భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన కంపెనీని ఎలా మరిచిపోగలం..’ అని అంటారు కదూ. ప్రస్తుతం ఈ సంస్థ ఒక భారతీయుడి అధీనంలో ఉందని చాలా కొద్ది మందికే తెలిసుంటుంది. ఈస్టిండియా కంపెనీకి ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాణిజ్య సంస్థగా పేరుంది. భారతదేశంపై బ్రిటిష్ సామ్రాజ్య పాలన కీలక ఏజెంట్‌గా ఈ కంపెనీ వ్యవహరించేది. కానీ ఇప్పుడు ఒక భారతీయ వ్యాపారవేత్త యాజమాన్యంలో ఉంది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ఈస్టిండియా కంపెనీని క్వీన్ ఎలిజబెత్ 1600లో స్థాపించారు. ఈ కంపెనీని మొదట్లో సుగంధ ద్రవ్యాలు, పట్టు, పత్తి, ఇతర వస్తువులను దేశంలోని తూర్పు ప్రాంతాల నుంచి వర్తకం చేసేందుకు ప్రారంభించారు. కాలక్రమేణా ఇది ఒక వాణిజ్య సంస్థగా మారి, తర్వాతి కాలంలో సైనిక, పరిపాలనా శక్తిగా అభివృద్ధి చెందింది. చివరికి భారతదేశంలోని చాలా ప్రాంతాలను అన్యాయంగా తన అధీనంలోకి తీసుకుంది. 1857 తిరుగుబాటు తరువాత, 1874లో బ్రిటిష్ క్రౌన్ కంపెనీని రద్దు చేశారు. భారతదేశంపై ప్రత్యక్ష నియంత్రణ నేరుగా బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేశారు. ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలు ముమ్మరంగా సాగేప్పుడు దాని సొంత ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. సొంతంగా కరెన్సీని ముద్రించింది. లక్షలాది మందిని దోపిడీ చేసింది.
ఇదీ చదవండి: ఊగిసలాడుతోన్న పసిడి ధరలు..
21వ శతాబ్దంలో యూకేలోని భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త సంజీవ్ మెహతా ఈస్టిండియా కంపెనీ బ్రాండ్‌ను పునరుద్ధరించారు. మెహతా 2005లో ఈస్టిండియా కంపెనీ పేరుపై ట్రేడ్ హక్కులను పొందాడు. అప్పటి నుంచి దాని చారిత్రక మూలాలకు కట్టుబడి లగ్జరీ బ్రాండ్‌గా తీర్చిదిద్దాడు. మెహతా నాయకత్వంలో ఈస్టిండియా కంపెనీ లగ్జరీ టీలు, కాఫీలు, చాక్లెట్లు, మసాలా దినుసులు, ఆహార పదార్థాలను విక్రయించే హైఎండ్ బ్రాండ్‌గా పునర్నిర్మించారు. లండన్‌లోని మేఫేర్‌లో ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థ ప్రపంచ మార్కెట్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.