
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా వాహన ధరలను పెంచనుంది. సెప్టెంబర్ నుంచి వివిధ మోడల్ కార్ల ధరలను 1–1.5 శాతం స్థాయిలో పెంచేందుకు చూస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ వెల్లడించారు. ప్రధానంగా యూరోతో మారకంలో రూపాయి బలహీనపడటంతో ధరల పెంపు యోచనకు తెరతీసినట్లు పేర్కొన్నారు.
అయితే ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు వాహన ధరలను పెంచడం గమనార్హం! 2025 జనవరి, జులైలో కార్ల ధరలను హెచ్చించింది. కాగా.. యూరో ప్రభావాన్ని తట్టుకునే బాటలో మరోసారి సెప్టెంబర్ నుంచి ధరల పెంపు చేపట్టనున్నట్లు అయ్యర్ తెలియజేశారు. గత నెల రోజులుగా యూరోతో మారకంలో రూపాయి 100 మార్క్ వద్దే కదులుతున్నట్లు తెలియజేశారు.
ఫలితంగా సెప్టెంబర్‌లో 1 నుంచి 1.5 శాతంవరకూ ధరల పెంపును చేపట్టనున్నట్లు తెలియజేశారు. ధరల పెంపు వల్ల ప్రభావం పడబోదని, మరోపక్క వడ్డీ రేట్లు దిగివస్తుండటంతో కొనుగోలుదారులకు ఈఎంఐ చెల్లింపులు బ్యాలన్స్ అవుతాయన్నారు. కంపెనీ కార్ల అమ్మకాలలో 80% ఫైనాన్స్ ద్వారానే నమోదవుతున్నట్లు చెప్పారు.