
మారుతి సుజుకి మానేసర్ ఫెసిలిటీలో అభివృద్ధి
గ్రీన్ లాజిస్టిక్స్, సమర్థవంతమైన వెహికల్ డిస్పాచ్ కోసం మారుతి సుజుకి తన మానేసర్ ఫెసిలిటీలో భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్‌ను ప్రారంభించింది. లాజిస్టిక్స్‌లో కార్బన్ ఉద్గారాలను, శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం, రహదారి రద్దీని కట్టడి చేయడం ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా హరియాణా ఆర్బిటల్ రైల్ కారిడార్ (హెచ్ఓఆర్‌సీ)తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని మారుతి సుజుకి ఈ సదుపాయాన్ని సోనిపట్ నుంచి పల్వాల్ వరకు 126 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసింది.
ఈ సదుపాయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మల్టీ మోడల్ కనెక్టివిటీకి గేమ్ ఛేంజర్ అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. సమర్థవంతమైన ఆటోమొబైల్ రవాణాలో కొత్త ఆవిష్కరణలు చేస్తూ, గ్రీన్ లాజిస్టిక్స్‌లో మారుతి సుజుకి ఆవిష్కరణలు చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి: రేపటి కోసం ఏం చేస్తానో తెలుసా..?
రైల్ లాజిస్టిక్స్ ద్వారా సుస్థిరత
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారుగా మారుతి సుజుకి పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు దాని సరఫరా గొలుసును ఆప్టిమైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త రైల్వే సైడింగ్ వాహనాల డిస్పాచ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని కంపెనీ భావిస్తుంది. ఇది రోడ్డు రవాణాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని చెప్పింది.
రైల్వే సైడింగ్ ముఖ్య లక్షణాలు
46 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్‌ను పూర్తిగా విద్యుదీకరణ చేశారు. నాలుగు ఫుల్ లెంత్ ట్రాక్‌లు, ఒక ఇంజిన్ ఎస్కేప్ ట్రాక్ ఉన్నాయి.
4,50,000 వాహనాల వార్షిక డిస్పాచ్ సామర్థ్యం కలిగి ఉంది. నిర్మాణాత్మక మల్టీ మోడల్ కనెక్టివిటీ విధానం ద్వారా భారతదేశం అంతటా 380 నగరాలకు సేవలు అందిస్తుంది.
ముంద్రా, పిపావావ్‌తో సహా ఇతర ఓడరేవులతో అనుసంధానం చేశారు. ప్రపంచ మార్కెట్లకు వాహన ఎగుమతులను ఇది క్రమబద్ధీకరిస్తుంది.
హెచ్‌వోఆర్‌సీ అభివృద్ధికి రూ.325 కోట్లు, అంతర్గత రైల్వే యార్డు మౌలిక సదుపాయాలకు రూ.127 కోట్లు కేటాయించారు.
ఈ కొత్త వ్యవస్థ ఏటా 1,75,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది. 60 మిలియన్ లీటర్ల ఇంధనాన్ని ఆదా చేస్తుందని అంచనా.