
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ ఏఐ (కృత్రిమ మేధ) ప్రయోజనాలను అందరికీ మరింతగా అందుబాటులోకి తేవాలని టెక్ దిగ్గజం లెనొవొ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా కేవలం పీసీలు మొబైల్స్‌లాంటి ఉత్పత్తులే కాకుండా ఏఐ ఆధారిత మౌలిక సర్విసులు, సొల్యూషన్స్‌ను విస్తృతంగా అందిస్తున్నట్లు లెనొవొ ఇండియా ఎండీ అమిత్ లూథ్రా, ఈడీ రోహిత్ వెల్లడించారు. ఇతర ఆసియా పసిఫిక్ దేశాల్లోని సంస్థలు బ్యాక్–ఆఫీస్ అవసరాల కోసమే ఏఐని ఉపయోగిస్తుండగా, దేశీయంగా సేల్స్, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్లు గణనీయంగా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాయని చెప్పారు.
భారత్‌లో ఇప్పటికే 53 శాతం సంస్థలు ఏఐ ఆధారిత పీసీలను వినియోగిస్తున్నట్లు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్‌పై (సీఐవో) నిర్వహించిన తమ అధ్యయనంలో వెల్లడైందని హైదరాబాద్‌లో తమ ఏఐ పోర్ట్‌ఫోలియోను డిస్‌ప్లే చేసిన సందర్భంగా వివరించారు. ప్రస్తుతం దేశీయంగా పర్సనల్ కంప్యూటింగ్ ఉత్పత్తుల విభాగంలో రెండో స్థానంలో, ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ విభాగంలో మూడో స్థానంలో ఉన్నట్లు రోహిత్ చెప్పారు. భారత్‌లో 5 తయారీ ప్లాంట్లు, సుమారు 1,700 మంది సిబ్బంది ఉండగా, గత ఆర్థిక సంవత్సరం 3.4 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదైందని ఆయన వివరించారు.