‘ఆ చిప్స్‌ ప్రాణాంతకం’.. వేలాది ప్యాకెట్లు వెనక్కి.. | Lays recalls thousands of its classic potato chips in US | Sakshi
Sakshi News home page

‘ఆ చిప్స్‌ ప్రాణాంతకం’.. వేలాది ప్యాకెట్లు వెనక్కి..

Jan 30 2025 7:00 PM | Updated on Jan 30 2025 7:28 PM

Lays recalls thousands of its classic potato chips in US

పొటాటో చిప్స్‌ను తయారు చేసే ప్రముఖ బ్రాండ్‌ లేస్‌ (Lays) యూఎస్‌లో తమ క్లాసిక్ పొటాటో చిప్స్‌ (potato chips) ప్యాకెట్లను వేలసంఖ్యలో రీకాల్‌ చేసింది. కొన్ని ప్యాకెట్లలోని చిప్స్‌లో కొందరికి ప్రాణహాని కలిగించే ఒక అప్రకటిత అలెర్జీ కారకం ఉన్నట్లు వెల్లడైన తర్వాత వేలకొద్దీ ప్యాకెట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఫ్రిటో లే కంపెనీ ప్రకటించింది.

ఈ మేరకు లేస్‌ ప్రకటించిన రీకాల్‌ను యూఎస్‌ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)  తాజాగా క్లాస్ 1 రీకాల్‌గా వర్గీకరించింది. అంటే తీవ్రమైన ఆరోగ్య పరిణామాలు లేదా మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూఎస్‌లోని ఒరెగాన్, వాషింగ్టన్‌లోని రిటైల్, ఆన్‌లైన్ స్టోర్‌లలో విక్రయించే 13-ఔన్స్ లేస్‌ క్లాసిక్ పొటాటో చిప్స్‌ 6,344 ప్యాకెట్లపై రీకాల్ ప్రభావం చూపుతుంది.

సందేహాస్పదమైన లేస్‌ చిప్స్‌ తయారీలో తీవ్రమైన అలెర్జీ కారకమైన పాలను వినియోగించారు. ఎఫ్‌డీఏ ప్రకారం.. అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపించగల ఎనిమిది ప్రధాన ఆహార అలెర్జీ కారకాలలో పాలు ఒకటి. పాలకు అలెర్జీ ఉన్నవారు దద్దుర్లు, కడుపు తిమ్మిరి, మైకము, స్వర తంతులు ఉబ్బడం లేదా అపస్మారక స్థితి వంటి లక్షణాలకు గురయ్యే ఆస్కారం ఉంటుంది.

చిప్స్‌లో పాలు ఉన్నట్లు గుర్తించిన ఓ కస్టమర్ లేస్‌ కంపెనీని అప్రమత్తం చేశారు. దీంతో లేస్ స్వచ్ఛందంగా రీకాల్‌ను ప్రారంభించింది. రీకాల్ ప్రత్యేకంగా ఒరెగాన్, వాషింగ్టన్‌లోని రిటైల్, ఈ-కామర్స్ అవుట్‌లెట్లలో విక్రయించే లేస్‌ క్లాసిక్ పొటాటో చిప్స్ 13-ఔన్స్ ప్యాకెట్లకు వర్తిస్తుంది. దీనికి సంబంధించి ఇంతవరకూ ఎటువంటి అలెర్జీ ప్రతిచర్యలు నమోదు కాలేదని, లేస్‌కు చెందిన ఇతర ఉత్పత్తులను రీకాల్‌ చేయడం లేదని డిసెంబరు 16 నాటి పత్రికా ప్రకటనలో ఫ్రిటో-లే పేర్కొంది.

అలర్జీ కారకాలు ఉన్నాయన్న కారణంతో జారీ చేసిన రీకాల్ ఇదొక్కటే  కాదు. గ్రానోలా బార్‌లు, పాన్‌కేక్ మిక్స్‌లు, సాస్‌లతో సహా మరో ఆరు ఆహార ఉత్పత్తులలో అప్రకటిత అలెర్జీ కారకాలు ఉండటంతో ఎఫ్‌డీఏ ఇటీవల ఆయా ఉత్పత్తుల రీకాల్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement