పోస్టాఫీసు పొదుపు పథకాలకు ప్రజల్లో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. పోస్టాఫీసుల ద్వారా ఆకర్షణీయమైన వడ్డీతోపాటు రిస్క్ లేకుండా రాబడిని ఇచ్చే స్కీములు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటే ‘కిసాన్ వికాస్ పత్ర’ (KVP). భారత ప్రభుత్వం మద్దతుతో ఇండియా పోస్ట్ అందించే అత్యంత నమ్మదగిన, సురక్షితమైన పెట్టుబడి పథకాలలో ఒకటిగా 2025లో కూడా కొనసాగుతోంది. కచ్చితమైన రాబడితో తక్కువ-రిస్క్ పెట్టుబడులను కోరుకునేవారి కోసం రూపొందించిన ఈ పథకం.. దీర్ఘకాలికంగా స్థిరంగా రాబడిని పెంచుకునే మార్గాన్ని అందిస్తోంది.
కచ్చితమైన రాబడి.. అసలుకు భద్రత
కిసాన్ వికాస్ పత్ర పథకం పెట్టుబడి పెట్టిన మొత్తానికి ప్రభుత్వ హామీతో కూడిన భద్రతను అందిస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, నిర్దిష్ట కాలవ్యవధిలో పెట్టుబడి రెట్టింపు అవుతుంది.
తక్కువ మొత్తంతోనే పెట్టుబడి
కిసాన్ వికాస్ పత్ర పథకంలో తక్కువ మొత్తం పెట్టుబడితోనే ప్రవేశించవచ్చు. కేవలం రూ.1,000తో పొదుపు ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఎలాంటి పరిమితి లేదు. ఇది చిన్న, మధ్యతరహా, పెద్ద మొత్తంలో పొదుపు చేసేవారికి కూడా అందుబాటులో ఉంటుంది.
ఆకర్షణీయమైన వడ్డీ రేటు
కిసాన్ వికాస్ పత్ర పథకంపై ప్రస్తుతం 7.5% చక్రవడ్డీ రేటు అందుబాటులో ఉంది. దీని ద్వారా పెట్టుబడి పెట్టిన మొత్తం సుమారు 115 నెలల్లో (9 సంవత్సరాలు 7 నెలలు) రెట్టింపు అవుతుంది. వడ్డీ రేటును ప్రభుత్వం కాలానుగుణంగా సవరిస్తుంది.
కేవీపీలో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?
కిసాన్ వికాస్ పత్రలో సాధారణ వ్యక్తులెవరైనా తమ పేరుతో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఇద్దరు, ముగ్గురు కలిసి కూడా జాయింట్ ఖాతాదారులుగా పొదుపు చేయవచ్చు. ఇక మైనర్లు అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ద్వారా ఈ స్కీములో చేరవచ్చు. ఖాతా తెరవడానికి పోస్టాఫీసు లేదా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖను సందర్శిస్తే సరిపోతుంది. గుర్తింపు, చిరునామా రుజువు వంటి ప్రాథమిక డాక్యుమెంట్లు అవసరమవుతాయి.
కేవీపీ పథకం ప్రధాన ఫీచర్లు, ప్రయోజనాలు
పెట్టుబడి రెట్టింపు: మార్కెట్ రిస్క్ లేకుండా నిర్దిష్ట కాలంలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది
ముందస్తు ఉపసంహరణ సౌకర్యం: 2.5 సంవత్సరాల తరువాత అత్యవసర పరిస్థితులలో మీ పెట్టుబడి సొమ్మును ఉపసంహరించుకోవచ్చు.
రుణం, బదిలీ సదుపాయం: కేవీపీ సర్టిఫికెట్లను బ్యాంకుల వద్ద పూచీకత్తుగా ఉంచి రుణం పొందవచ్చు. పెట్టుబడిని వ్యక్తుల మధ్య లేదా పోస్టాఫీసుల మధ్య బదిలీ చేయవచ్చు.
మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన వృద్ధి: స్టాక్ మార్కెట్ లేదా ఇతర అస్థిర పెట్టుబడి సాధనాలతో సంబంధం లేకుండా, పూర్తిగా రిస్క్ రహితమైన పెట్టుబడి మార్గం.
2025లో కిసాన్ వికాస్ పత్ర ఎందుకంటే..
మార్కెట్ అస్థిరత, ఫిక్స్డ్ డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేట్లు ఉన్న పరిస్థితుల్లో కిసాన్ వికాస్ పత్ర స్థిరమైన వృద్ధిని కోరుకునే మదుపరులకు సురక్షితమైన ఆశ్రయం అందిస్తుంది. ఇది కొంత మందికి ప్రత్యేకంగా సరిపోతుంది. ముఖ్యంగా స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే సీనియర్ సిటిజన్లు, పదవీ విరమణ చేసినవారు, ప్రభుత్వ హామీతో కూడిన పొదుపును ఇష్టపడే గ్రామీణ మదుపరులు, చదువు, వివాహం లేదా పదవీ విరమణ కోసం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు చేసుకునే కుటుంబాలకు కిసాన్ వికాస్ పత్ర సరైన ఎంపికగా నిలుస్తుంది.


