
న్యూఢిల్లీ: భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ)చీఫ్ ఉపేంద్ర కుష్వాహా, బీజేపీ సీనియర్ నేత వినోద్ తవ్డేలతో దేశ రాజధాని ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇది బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన తవ్డే.. పవన్ సింగ్ బీజేపీలోనే ఉంటారని ధృవీకరించారు. ఆయన ఉపేంద్ర కుష్వాహా నుండి ఆశీస్సులు పొందారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీలో చురుకుగా పని చేస్తారన్నారు.
బీహార్ ఎన్నికలకు ముందు భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ బీజేపీ నేతలను కలుసుకోవడం కీలక పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భోజ్‌పురి మాట్లాడే ఓటర్లలో ఆయనకు ఎంతో ఆదరణ ఉంది.ఈ పరిణామం బీజేపీ నేతలను, కార్యకర్తలను ఉత్సాహ పరుస్తుందని, పార్టీ ప్రచారానికి కొత్త ఊపు వస్తుందని పలువురు భావిస్తున్నారు. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో కరకట్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పవన్ సింగ్ బరిలోకి దిగడం ఉపేంద్ర కుష్వాహా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందంటారు. రాజ్‌పుత్ వర్గం కుష్వాహాకు మద్దతు ఇవ్వలేదని, ఇది సమీప నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతుంటారు. ఫలితంగా షహాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలలో బీజేపీకి గణనీయమైన నష్టం వాటిల్లిందని అంటారు.
భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ 2024లో మొదటిసారిగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నుండి పోటీకి నిలిపారు. అయితే అతను తన మ్యూజిక్ వీడియో పాటల్లో బెంగాలీ మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించారనే ఆరోపణలుతో పార్టీ అతన్ని పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని కోరింది. దీంతో ఆయన కరకట్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కొన్ని సీట్లను కోల్పోయేలా చేసింది.
బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఇంకా తేదీలను ప్రకటించలేదు. మునుపటి అసెంబ్లీ ఎన్నికలు 2020 అక్టోబర్-నవంబర్‌లో జరిగాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2022, ఆగస్టులో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఎన్డీఏతో సంబంధాలను తెంచుకుని, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం 2024, జనవరిలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌తో సంబంధాలను తెంచుకుని, తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.