
మారుతున్న జీవనశైలితో అనారోగ్య పరిస్థితులు పెరుగుతున్నాయి. దాంతో ఆసుపత్రి ఖర్చులు అధికమవుతున్నాయి. వీటివల్ల మధ్య తరగతి ప్రజలు పేదరికంలోకి వెళుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి అందరూ ఆరోగ్య బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునేవారికి సాధారణంగా కొన్ని అనుమానాలు, ప్రశ్నలు ఉంటాయి. వాటిలో కొన్నింటికి కింద సమాధానాలు తెలియజేశాం.
ఆరోగ్య బీమా ప్రాథమిక ఉద్దేశం ఏమిటి?
ఆసుపత్రిలో చేరడం, డాక్టర్ సంప్రదింపులు, చికిత్సలు, శస్త్రచికిత్సలు వంటి వైద్య ఖర్చులను కవర్ చేయడం ద్వారా ఆరోగ్య బీమా ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఇది ఊహించని ఆరోగ్య సంరక్షణ ఖర్చుల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే ఏమిటి?
ఆరోగ్య బీమా ప్రీమియం అనేది ఆరోగ్య కవరేజీని నిర్వహించడానికి బీమా కంపెనీకి చెల్లించే మొత్తం. పాలసీ నిబంధనలను బట్టి నెలవారీగా, త్రైమాసికంగా లేదా వార్షికంగా చెల్లించవచ్చు.
నెట్‌వర్క్ హాస్పిటల్ అంటే ఏమిటి?
నెట్‌వర్క్ ఆసుపత్రులు నగదు రహిత చికిత్సను అందించడానికి బీమా సంస్థలతో ఒప్పందం కలిగి ఉంటాయి. అంటే పాలసీదారుడు ముందస్తుగా వైద్య ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేదు. బదులుగా బీమా సంస్థ నేరుగా ఆసుపత్రితో బిల్లులను సెటిల్ చేస్తుంది.
క్యాష్ లెస్ క్లెయిమ్ అంటే ఏమిటి?
క్యాష్ లెస్ క్లెయిమ్ ద్వారా పాలసీదారులు ముందుగా ఖర్చులు చెల్లించకుండానే నెట్ వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు. బీమా సంస్థ నేరుగా వైద్య ఖర్చులను చెల్లిస్తుంది. ఇది వైద్య ప్రక్రియకు అంతరాయం లేకుండా చూస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్‌లో ప్రీకండిషన్ షరతులు ఏమిటి?
ప్రీకండిషన్ పరిస్థితి అనేది పాలసీని కొనుగోలు చేయడానికి ముందు నిర్ధారణ అయిన ఏదైనా అనారోగ్యం లేదా వైద్య పరిస్థితిని సూచిస్తుంది. కొన్ని బీమా సంస్థలు ఈ వైద్య పరిస్థితులకు చికిత్సను కవర్ చేయడానికి ముందు వెయిటింగ్ పీరియడ్లను విధిస్తాయి.
హెల్త్ ఇన్సూరెన్స్‌లో వెయిటింగ్ పీరియడ్ అంటే ఏమిటి?
వెయిటింగ్ పీరియడ్ అనేది కొన్ని అనారోగ్యాలు లేదా చికిత్సలు కవర్ చేయలేని సమయం. ఉదాహరణకు పాలసీదారులు తమ ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి ముందు ప్రసూతి కవరేజీకి 2-4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉండవచ్చు.
ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అంటే ఏమిటి?
ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో ఓకే పాలసీ ద్వారా కుటుంబ సభ్యులకు బీమా సదుపాయం కల్పిస్తారు. దీని ప్రీమియం వ్యక్తిగత పాలసీల కంటే ఎక్కువ ఉంటుంది.
ఇదీ చదవండి: పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
వ్యక్తిగత, కమ్యునిటీ ఆరోగ్య బీమా మధ్య తేడా ఏమిటి?
వ్యక్తిగత ఆరోగ్య బీమా ఒక వ్యక్తికి కవర్ ఇస్తుంది. అయితే కమ్యునిటీ ఆరోగ్య బీమా విభిన్న వ్యక్తులకు కవరేజీని అందిస్తుంది. తరచుగా ఈ పాలసీలను కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు అందిస్తాయి.
నో క్లెయిమ్ బోనస్ అంటే ఏమిటి?
ఏడాదిలో పాలసీని క్లెయిమ్ చేయని పాలసీదారులకు నో క్లెయిమ్ బోనస్ రివార్డుగా అందిస్తారు. ఇది డిస్కౌంట్ ప్రీమియంలు లేదా తదుపరి రెన్యువల్‌లో బీమా పెంపు వెసులుబాటు రూపంలో ఇస్తారు.
మెడికల్ హిస్టరీని బహిర్గతం చేయడం ఎందుకు ముఖ్యం?
వైద్య చరిత్రను వెల్లడించడంలో విఫలమైతే క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంటుంది. కవరేజీ అర్హతను నిర్ణయించడానికి బీమా సంస్థలకు కచ్చితమైన ఆరోగ్య సమాచారం అవసరం.