
భారత్-పాకిస్థాన్ యుద్ధంతో పాక్‌కు తంటాలు తప్పడం లేదు. యుద్ధ సమయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో పాక్ తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. దాంతో ఆర్థికంగా, వాణిజ్యం పరంగా సవాళ్లు ఎదుర్కొంటోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ నుంచి ఓడరేవుల ద్వారా వచ్చే సరుకుల రవాణాను భారతదేశం నిషేధించింది. ఇది ఆ దేశ దిగుమతులు, ఎగుమతులను గణనీయంగా ప్రభావితం చేస్తోంది.
ఈ చర్య వల్ల పాకిస్థాన్‌కు, అక్కడి నుండి ఇతర దేశాలకు వెళ్లే ప్రత్యక్ష సర్వీసులను కోర్ షిప్పింగ్ లైన్లు నిలిపివేశాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు పాక్ ఫీడర్ నౌకలపై ఆధారపడవలసి వస్తుంది. ఈ నిషేధం వల్ల ముఖ్యంగా ఐరోపాతో దాయాది దేశం వాణిజ్యం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. భారతదేశంలోని ముంద్రా నౌకాశ్రయం పాక్ నుంచి యూరప్ వెళ్లే ఎగుమతులకు కీలకమైన ట్రాన్స్‌షిప్‌మెంట్ కేంద్రంగా ఉంది. కానీ పాక్ ఉగ్రవాదులు భారత పర్యాటకులను దారుణంగా హతమార్చిన నేపథ్యంలో భారత్ విజయవంతంగా ఆపరేషన్ సింధూర్‌ను అమలు చేసింది. ఈ సమయంలో పాక్ సరుకు రవాణాను నిషేధించింది.
భారంగా బీమా ఛార్జీలు
ప్రస్తుతం పాకిస్థాన్ షిప్పింగ్ కంపెనీలు కొలంబో, సలాలా, జెబెల్ అలీ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్స్ ద్వారా సరుకును రవాణా చేస్తున్నాయి. దాంతో పాక్ సంస్థలకు అదనంగా బీమా ఛార్జీలు భారంగా మారాయి. దాంతోపాటు పాకిస్థానీ అమ్మకందారులతో వ్యవహరించే వ్యాపారులను బ్యాంకు గ్యారంటీలు ఇవ్వమని కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇది వాణిజ్య కార్యకలాపాలను మరింత క్లిష్టతరం చేస్తుంది.
ఇదీ చదవండి: ‘భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధం’
పేరుకుపోతున్న నిల్వలు
ఇప్పటికే కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కీలక పరికరాలు, ముడిసరుకులు, యంత్రాల దిగుమతుల్లో జాప్యాన్ని ఎదుర్కొంటుందని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ధాన్యాలు, వస్త్రాల ఎగుమతులు కూడా దెబ్బతింటాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల పాకిస్థాన్‌లోని వివిధ టెర్మినల్స్ వద్ద ఎగుమతి కంటైనర్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. దాంతో సరుకుల రవానా ఒకటి నుంచి మూడు రోజుల వరకు ఆలస్యం అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.