టాటా సియెర్రా ఎస్‌యూవీ డెలివరీలు జనవరి 15 నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. NATRAX పరీక్షా కేంద్రంలో తన సామర్థ్యాలను ప్రదర్శించిన అనంతరం ఈ ఎస్‌యూవీ కేరళకు చేరుకుంది. రాష్ట్ర రవాణా మంత్రి కె.బి. గణేష్ కుమార్ కేరళలో తొలి యూనిట్‌ను స్వీకరించిన మొదటి గ్రహీతగా నిలిచారు.
కేరళ రవాణా మంత్రి కె.బి. గణేష్ కుమార్ రాష్ట్రంలోని ప్రముఖ టాటా డీలర్‌షిప్‌లలో ఒకటైన శ్రీ గోకులం మోటార్స్ నుంచి సియెర్రా కారును డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉన్నప్పటికీ.. టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.
వాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్‌టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లలో వస్తోంది.
ఈ కొత్త తరం టాటా సియెర్రాలో సరికొత్త 1.5-లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 158 బీహెచ్‌పీ శక్తి, 255 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఆరు-స్పీడ్ ఏటీ గేర్బాక్సతో మాత్రమే వస్తుంది. ఇక సియెర్రా 1.5-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ 105 బీహెచ్‌పీ శక్తి, 145 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే డీజిల్ 1.5-లీటర్ ఇంజన్ 116 బీహెచ్‌పీ శక్తి, 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ ఎంటీ లేదా ఏడు-స్పీడ్ డీసీటీతో లభిస్తుంది.


