కర్ణాటకలో ఐటీ వృద్ధిని కేవలం బెంగళూరుకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు విస్తరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఐటీ పాలసీ 2025-2030ను ప్రకటించింది. బెంగళూరు టెక్ సమ్మిట్ (BTS) 28వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో ఈ పాలసీని ఆవిష్కరించారు.
రాష్ట్రంలో బెంగళూరు దాటి ఇతర ప్రాంతాల్లో తమ ప్రతిభను విస్తరించే సంస్థలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని అందించనుంది. కంపెనీలు నియమించే ప్రతి ఉద్యోగికి రూ.50,000 వరకు వన్-టైమ్ రీలొకేషన్ ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటించింది. ఈ ప్రోత్సాహకంలో భాగంగా బెంగళూరు నుంచి మైసూరు, మంగళూరు, హుబ్లీ-ధార్వాడ్, కలబురగి, శివమొగ్గ వంటి నగరాలకు ఉద్యోగులను తరలించే సంస్థలకు ఈ ప్రోత్సాహకం ఇస్తామని తెలిపింది.
ఈ సందర్భంగా కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ..‘బెంగళూరు మినహా ఇతర నగరాల్లో ఐటీ కంపెనీల కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం రూ.445 కోట్లు కేటాయించింది’ అని చెప్పారు.
డీప్‌టెక్ ఇన్నోవేషన్ హబ్
కొత్త ఐటీ పాలసీ 2025-30 కర్ణాటకను డీప్‌టెక్ ఇన్నోవేషన్ గమ్యస్థానంగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘భారతదేశపు అతిపెద్ద ఐటీ ఆర్ అండ్ డీ, ఉత్పత్తి అభివృద్ధి కేంద్రం కర్ణాటక. రూ.3.2 లక్షల కోట్లకు పైగా విలువైన దేశ ఐటీ ఎగుమతుల్లో 42% వాటా కర్ణాటకదే. ఇది సంవత్సరానికి 27% చొప్పున పెరుగుతోంది. రాష్ట్రంలో 550 కంటే ఎక్కువ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఉన్నాయి. ఇది భారతదేశం మొత్తంలో మూడింట ఒక వంతు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 400 కంటే ఎక్కువ సంస్థలు బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి’ అన్నారు.
ఇదీ చదవండి: బీమా ఏజెంట్లు చెప్పని విషయాలు..


