న్యూఢిల్లీ: తదుపరి తరం టెలికాం సాంకేతికతలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రిలయన్స్ జియో అడుగులు వేస్తోంది. స్వదేశీ శాటిలైట్ టెక్నాలజీ స్టాక్‌ను అభివృద్ధి చేయడంతో పాటు ప్రీ-6జీ సాంకేతికతకు సంబంధించి ఇప్పటికే పేటెంట్లను దాఖలు చేసినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా ఏఎన్‌ఐతో మాట్లాడిన ఆయన.. ఏఐ ఆధారిత వాయిస్, డేటా సేవలు, శాటిలైట్ కనెక్టివిటీ, 6జీ వంటి అధునాతన కమ్యూనికేషన్ టెక్నాలజీలపై జియో దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
శాటిలైట్ సాంకేతికతలో జియో సాధిస్తున్న పురోగతిని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రదర్శిస్తున్నట్లు ఆకాష్ అంబానీ చెప్పారు. భారత్‌లోనే అభివృద్ధి చేసిన పూర్తి స్థాయి శాటిలైట్ టెక్నాలజీ స్టాక్‌ను రూపొందించడమే లక్ష్యమన్నారు. పరిశోధన, పేటెంట్లు, అంతర్జాతీయ ప్రమాణాల రూపకల్పన వంటి అంశాల్లో జియో చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు.
6జీ సాంకేతికతలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించాలన్న భారత్ లక్ష్యానికి జియో తన వంతు సహకారం అందించనుందని అంబానీ చెప్పారు. 6జీ పేటెంట్లలో 10 శాతం భారత్ నుంచి రావాలన్న లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ప్రయత్నంలో జియో కీలకంగా భాగస్వామి అవుతుందని పేర్కొన్నారు. 6జీ వాణిజ్య అభివృద్ధి దశకు చేరకముందే ప్రీ-6జీ సాంకేతికతకు సంబంధించి పేటెంట్ల దాఖలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.
వినియోగదారుల సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృత్రిమ మేధస్సును విస్తృతంగా వినియోగించే అవకాశాలను జియో పరిశీలిస్తోంది. ఏఐ సాయంతో వాయిస్, డేటా సేవల్లో కొత్త ఆవిష్కరణలు తీసుకురావచ్చని అంబానీ అన్నారు. ఇవి దేశవ్యాప్తంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూర్చగలవని పేర్కొన్నారు.


