కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సినిమా కార్యక్రమాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఫ్రాన్స్‌లోని అందమైన సముద్రతీర నగరం కేన్స్‌లో ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు, దర్శకులు, ఫ్యాషన్ ప్రముఖులు రెడ్ కార్పెట్‌పై మెరిసిపోతారు. ఈ ఏడాది భారతీయ నటి అలియా భట్ ధరించిన సాఫ్ట్ బ్లష్ గౌన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యే ప్రముఖులు ఎక్కువగా దిగే హోటళ్లలో 'హోటల్ మార్టినెజ్' ఒకటి. ఇది కేవలం ఒక విలాసవంతమైన హోటల్ మాత్రమే కాదు, సినీ ప్రముఖుల అభిమాన కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. గతంలో దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్ బచ్చన్, బెల్లా హడిడ్ వంటి ఎంతోమంది ప్రముఖులు ఈ హోటల్‌లో బస చేశారు.
1929లో ప్రారంభమైన ఈ హోటల్.. అద్భుతమైన ఆర్ట్ డెకో శైలిలో ఉంది. దీని నిర్మాణం కేవలం 14 నెలల్లో పూర్తయింది. ఈ హోటల్‌లోని బాల్కనీల నుంచి సముద్రం కనిపిస్తుంది. ఈ కారణంగానే చాలామంది సినీ ప్రముఖులు ఇక్కడ ఉండటానికి ఇష్టపడతారు.
2013లో ఈ హోటల్‌ను హయత్ కొనుగోలు చేసింది. ఆ తరువాత దీనిని 'ది అన్‌బౌండ్ కలెక్షన్ బై హయత్'లో విలీనం చేసింది. ఈ హోటల్ ఆతిథ్యానికి, సౌకర్యానికి, విలాసానికి ప్రతీకగా నిలిచింది.
బౌలేవార్డ్ డి లా క్రోయిసెట్ అనే వీధిలో ఈ హోటల్ ఉంది. ఇక్కడ నుంచి పలైస్ డెస్ ఫెస్టివల్స్ అనే ఫిల్మ్ ఫెస్టివల్ ప్రధాన వేదికకు కొన్ని నిమిషాల దూరమే ఉంటుంది. అందువల్ల ఫెస్టివల్ సమయంలో ఇక్కడ భారీ రద్దీ కనిపిస్తుంది. హోటల్‌లోని గదులు సాధారణ డీలక్స్ రూమ్స్ నుంచి సముద్ర వీక్షణం కలిగిన విలాసవంతమైన సూట్స్ వరకు ఉంటాయి. ఫెస్టివల్ సమయంలో ధరలు మరింత పెరుగుతాయి. ఇక్కడ ఒక రాత్రి బస చేయడానికి గరిష్టంగా రూ.8.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా.. కార్పొరేట్ సమావేశాలు, పెళ్లిళ్లు, కుటుంబ విహార యాత్రల కోసం కూడా ఈ హోటల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. దాదాపు శతాబ్దకాల చరిత్ర కలిగిన హోటల్ మార్టినెజ్.. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా విలాసానికి, ఫ్యాషన్‌కు, సినీ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: పదేళ్ల కనిష్ఠానికి గోల్డ్ డిమాండ్.. కారణాలివే!


