బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్‌ను విజయవంతంగా దాటేసింది. శివ రావైల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. ఇండియాలో రూ. 9.75 కోట్లను రాబట్టింది. వీకెండ్‌లో రూ. 34 కోట్ల వసూళ్ల సాధించింది. ఐదో రోజు రూ. 4.25 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. మొత్తంగా దేశ వ్యాప్తంగా రూ. 42.10 కోట్ల నెట్ కలెక్షన్స్‌ని రాబట్టింది.
ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం నిలకడగా సాగుతోంది. మంగళవారం ఒక్క రోజే రూ. 1.50 కోట్ల రూపాయలు వసూలు చేయడంతో, మొత్తం ఓవర్సీస్ కలెక్షన్లు 19.80 కోట్ల రూపాయలకు చేరాయి. ఇక భారతదేశ వసూళ్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 'ఆల్ఫా' మొత్తం కలెక్షన్లు 70.03 కోట్ల రూపాయల మార్క్‌ను తాకాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాపులర్ 'స్పై యూనివర్స్'లో ఏడవ భాగంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆలియా భట్‌తో పాటు శర్వరీ, అనిల్ కపూర్, బాబీ డియోల్, దియా మీర్జా కీలక పాత్రల్లో నటించారు.


