
క్యూ1లో నికర లాభం రూ. 6,921 కోట్లు; 9 శాతం అప్
ఆదాయం రూ. 42,279 కోట్లు
2025–26 ఆదాయ అంచనాలు పెంపు
20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 9 శాతం ఎగసి రూ. 6,921 కోట్లను తాకింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ. 6,368 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం పుంజుకుని రూ. 42,279 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 39,315 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 5,189 కోట్ల నుంచి రూ. 5,173 కోట్లకు స్వల్పంగా తగ్గాయి.
1–3 శాతం వృద్ధి
పూర్తి ఏడాదికి ఆదాయంలో స్థిర కరెన్సీ ప్రాతిపదికన 1–3 శాతం పురోగతి సాధించగలమని ఇన్ఫోసిస్ తాజాగా అంచనా (గైడెన్స్) వేసింది. తద్వారా గతంలో ప్రకటించిన 0–3 శాతం గైడెన్స్‌ను స్వల్పంగా మెరుగుపరచింది. 20–22 శాతం స్థాయిలో నిర్వహణ మార్జిన్లు సాధించగలమన్న గత అంచనాలను కొనసాగించింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో నిర్వహణ లాభం(ఇబిటా) 6 శాతం వృద్ధితో రూ. 8,803 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 21.1 శాతం నుంచి 20.8 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ఫ్రీ క్యాష్‌ఫ్లో 18 శాతం తక్కువగా రూ. 7,533 కోట్లకు చేరింది.
విభాగాలవారీగా..
ఇన్ఫోసిస్ క్యూ1 ఆదాయంలో ఫైనాన్షియల్ సరీ్వసుల వాటా 28 శాతం కాగా.. తయారీ 16 శాతం, రిటైల్ 13.4 శాతం చొప్పున ఆక్రమించాయి. ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర అమెరికా నుంచి ఆదాయంలో దాదాపు 57 శాతం సమకూరింది. గత క్యూ1లో ఇది 59 శాతంకాగా.. యూరప్ వాటా 32 శాతంగా నమోదైంది. గత క్యూ1లో ఇది 28 శాతమే. గత కొన్ని త్రైమాసికాలుగా యూరప్‌లో బలమైన వృద్ధిని సాధిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో జయేష్ ఎస్. పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం యూరప్‌లో చేపట్టిన పెట్టుబడుల ఫలితమిదని తెలియజేశారు. అయితే ఇప్పటికీ యూఎస్ అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తున్నట్లు వెల్లడించారు.
మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు బీఎస్‌ఈలో 0.3 శాతం బలపడి రూ. 1,574 వద్ద ముగిసింది.
క్యూ1లో ఇతర విశేషాలు..
→ 3.8 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. వీటిలో 55 శాతం కొత్తగా పొందినవే.
→ 210 మంది ఉద్యోగులను జత కలుపుకుంది. మొత్తం సిబ్బంది సంఖ్య 3,23,788కు చేరింది.
→ గతంలో ప్రకటించినట్లుగా పూర్తి ఏడాదిలో 20,000 మంది ఫ్రెషర్స్ నియామకం.
→ ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు దాదాపు యథాతథంగా 14.4 శాతంగా నమోదైంది.