ఐఆర్‌సీటీసీ.. వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ట్రైన్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో మరో మార్పును ప్రవేశపెట్టింది. రిజర్వేషన్ వ్యవస్థ ప్రయోజనాలను ప్రయాణీకులకు చేరేలా చూడటం, మోసాలను నివారించడమే లక్ష్యంగా ఆధార్ ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేస్తూ దీనిని ప్రవేశపెట్టింది.
రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాలలో IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా రిజర్వ్ చేయబడిన రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు.. ఆధార్ ఆధారిత ధృవీకరణ తప్పనిసరి. పదిహేను నిమిషాల తర్వాత మాత్రమే అధీకృత ఏజెంట్లు టిక్కెట్లు రిజర్వేషన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. అయితే ఇండియన్ రైల్వేస్ కంప్యూటరైజ్డ్ PRS కౌంటర్ల ద్వారా రిజర్వ్డ్ టిక్కెట్ల బుకింగ్ విషయంలో ఎటువంటి మార్పు లేదు.
తాజా మార్గదర్శకాల ప్రకారం, ఉదయం వేళల్లో రిజర్వ్ చేయబడిన రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఆధార్ ఆధారిత ధృవీకరణను IRCTC తప్పనిసరి చేసింది. ఎవరైతే ఆధార్ ధృవీకరణ చేశారో.. వారే టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. ఇది 2025 అక్టోబర్ 28 నుంచి అమల్లోకి వచ్చింది.
ఇదీ చదవండి: టెస్లా బాస్‌కు భారీ ప్యాకేజ్: దిగ్గజ సీఈఓల వేతనాలు ఇవే..


