బీసీలకు 17.08 శాతం రిజర్వేషన్లే దక్కినట్టు అంచనా !
సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు విధించిన వ్యయ పరిమితి నామ్‌కే వాస్తేనే...
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 2,176 గ్రామాలు దక్కినట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే బీసీలకు 17.08 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్టుగా తెలిసింది. 2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా అంటే 18 నుంచి 23 శాతంలోపు బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
ఇప్పుడు జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ దాదాపు అదే ఒరవడిలో బీసీలకు సర్పంచ్ స్థానాలు కేటాయించినట్టుగా తెలిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) అందుబాటులోకి తెచ్చిన సమాచారం ప్రకారం జిల్లాల వారీగా బీసీ వర్గాలకు కేటాయించిన సర్పంచ్ స్థానాల సంఖ్య ఈ విధంగా ఉన్నాయి.
👉సంఖ్యాపరంగా 136 స్థానాలతో సిద్దిపేట జిల్లా ముందున్నది
👉పర్సంటేజ్ పరంగా 27.45 శాతంతో జోగుళాంబ గద్వాల జిల్లా అగ్రస్థానంలో ఉన్నది
👉7 జిల్లాలో బీసీ రిజర్వేషన్లు 10 శాతానికి మించలేదు.
బదిలీలు, ప్రమోషన్లపై నిషేధం
స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ముడిపడిన అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై పూర్తి నిషేధం విధించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) పేర్కొంది. ఎన్నికల పీరియడ్‌లో లౌడ్ స్పీకర్ల వినియోగం, ఊరేగింపుల నిర్వహణ, బహిరంగ సభల నిర్వహణ, ఓటర్లను ప్రలోభపరిచే అవినీతి చర్యలు, తదితరాలపై పోలీస్‌శాఖ కచ్చితమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. మంగళశవారం రాత్రి నుంచే గ్రామాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)అమల్లోకి వచ్చిందని ఎస్‌ఈసీ తెలియజేసింది.
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులన్న నిబంధనను ఈ ఎన్నికల్లో ఎత్తివేశారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సర్కార్ నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధనను ఎత్తివేశారు. తెలంగాణలో మాత్రం గ్రామీణ స్థానిక సంస్థల్లో ఈ నిబంధన కొనసాగింది. బీఆర్‌ఎస్ హయాంలోనే మున్సిపల్ ఎన్నికల్లో ఈ నిబంధనను ఎత్తేశారు. అయితే గ్రామీణ స్థానిక సంస్థల్లో మాత్రం ఈ నిబంధన కొనసాగింది. రాష్ట్ర కేబినెట్‌లో ఈ అంశంపై చర్చించాక ఈ నిబంధనను ఎత్తివేశారు.
2011 జనాభా లెక్కల ప్రకారం గరిష్ట వ్యయ పరిమితి ఇలా...
👉5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి రూ.30 వేల వరకు, సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.
👉5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి రూ.50 వేల వరకు, సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.2.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.
పోలింగ్ రోజు నియమాలు
👉గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 44 గంటల ముందు మద్యం అమ్మకాలపై నిషేధం.
👉ఓటర్లకు ఇచ్చే స్లిప్పులు తెల్ల కాగితంపై ఉండాలి. వాటిపై పార్టీ గుర్తు గానీ, అభ్యర్థి పేరు గానీ ఉండకూడదు.
👉ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మంత్రులు, ప్రభుత్వానికి...నిధులు, పథకాలు, కొత్త గ్రాంట్లు మంజూరు చేయడం, కొత్త పథకాలు ప్రకటించడం లేదా ఆర్థిక హామీలు ఇవ్వడం నిషేధం
👉కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయకూడదు.
👉మంత్రులు తమ ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలు లేదా సిబ్బందిని వాడకూడదు.
👉మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, సర్పంచ్‌లు, ప్రభుత్వో ద్యోగులు పోలింగ్ లేదా కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండొద్దు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముఖ్యాంశాలు
👉ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుంది.
👉ఎన్నికలు జరిగే నిర్దిష్ట ప్రాంతానికి (గ్రామ పంచాయతీ లేదా వార్డు) ఇది వర్తిస్తుంది.
👉కులాలు, మతాలు లేదా వర్గాల మధ్య ఉద్రిక్తతలు లేదా విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేయకూడదు. ఓట్ల కోసం మతం లేదా కులం పేరుతో విజ్ఞప్తి చేయకూడదు
👉 ప్రార్థనా మందిరాలు: దేవాలయాలు, మసీదులు, చర్చిలను ఎన్నికల ప్రచారానికి వాడకూడదు.
👉 విధానాలు, పథకాలపై మాత్రమే విమర్శలు ఉండాలి. అభ్యర్థుల వ్యక్తిగత జీవితంపై నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు.
👉 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలి.
👉 సభలు, ర్యాలీలకు స్థానిక అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి.
👉 కేవలం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే బహిరంగ సభల కోసం లౌడ్ స్పీకర్లను అనుమతిస్తారు
👉 పాటలు లేదా సంగీతం వినిపించడానికి లౌడ్ స్పీకర్లను వాడకూడదు.


