ఆన్‌లైన్ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టిస్తున్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు
88% మంది వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం
అమెజాన్‌పై అత్యధిక విశ్వాసం; ఫ్లిప్‌కార్ట్‌పై అపనమ్మకం అధికం
మార్కెట్ పరిశోధనా సంస్థ డేటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్, క్విక్ కామర్స్, ఆన్‌లైన్ ట్రావెల్ రంగాలకు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారులను తప్పుదోవ పట్టించే ‘డార్క్ ప్యాటర్న్స్’ (మోసపూరిత డిజైన్ విధానాలు) కారణంగా భారతీయ ఆన్‌లైన్ కొనుగోలుదారులు ఏటా రూ.25,000 కోట్ల నుంచి రూ.28,000 కోట్ల వరకు నష్టపోతున్నట్లు మార్కెట్ పరిశోధనా సంస్థ డేటమ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
సంస్థ మంగళవారం విడుదల చేసిన ‘డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేసెస్’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2026 తొలి త్రైమాసికంలో దేశంలోని 50 నగరాలకు చెందిన 2,590 మంది వినియోగదారులపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ–కామర్స్, క్విక్ కామర్స్, ఆన్‌లైన్ ట్రావెల్ రంగాలకు చెందిన 12 ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఇందులో విశ్లేషించారు.
డార్క్ పాటర్న్స్ అంటే: ఉత్పత్తులు లేదా సేవలను అంటగట్టేందుకు అనుసరించే వివిధ పద్ధతులే డార్క్ పాటర్న్స్‌గా వ్యవహరిస్తారు. వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేయడం, వారిని గందరగోళానికి గురిచేయడం, బలవంతంగా షాపింగ్ చేయించడమే వీటి లక్ష్యం.
నివేదికలో మరిన్ని అంశాలు:
→ రహస్య ఛార్జీలు, బలవంతపు యాడ్–ఆన్‌లు, డ్రిప్ ప్రైసింగ్, ఫాల్స్ అర్జెన్సీ, సబ్‌్రస్కిప్షన్ ఉచ్చులు వంటి విధానాల కారణంగా దేశంలోని 30.4 కోట్ల మంది ఆన్‌లైన్ కొనుగోలుదారుల్లో 88 శాతం మంది నెలకు సగటున రూ.78 నుంచి రూ.87 వరకు అదనపు భారం భరిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
→ ప్రారంభంలో ఒక ధర చూపించి, చెల్లింపు దశలో అదనపు రుసుములు జోడించే ‘డ్రిప్ ప్రైసింగ్’ లేదా ‘హిడెన్ ఛార్జీలు’ ఎదురవుతున్నాయని 63 % మంది డిజిటల్ చెల్లింపుల వినియోగదారులు తెలిపారు. 2024లో ఈ సంఖ్య 52 శాతంగా ఉండగా, ప్రస్తుతం 63 శాతానికి పెరగడం ఆందోళన కలిగించే అంశమని నివేదిక పేర్కొంది
→ అధ్యయనంలో భాగమైన 73 శాతం ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులకు ఇష్టం లేకపోయినా.., కొనుగోలు చేసేలా బలవంతపు వ్యూహాలు (ఫోర్డ్స్ యాక్షన్) అమలు చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది.
→ ఆన్‌లైన్ కొనుగోలుదారులలో 81 శాతం మందికి ఇలాంటి మోసపూరిత టెక్నిక్స్ (డార్క్ ప్యాటర్న్స్) గురించి అవగాహన ఉన్నప్పటికీ, వారిలో 85 శాతం మంది డార్క్ ప్యాటర్న్స్ వల్ల ఏదో ఒక రూపంలో తప్పుదోవ పట్టించబడినట్లు వెల్లడించారు. దీనిని నివేదిక ‘అవగాహన వైరుధ్యం’ గా అభివరి్ణంచింది.
→ ఈ–కామర్స్ విభాగంలో 50 శాతం మంది వినియోగదారుల మద్దతుతో అమెజాన్ అత్యంత విశ్వసనీయ వేదికగా నిలిచింది. మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ విషయంలో నమ్మకం (37 శాతం) కంటే అపనమ్మకమే (41 శాతం) ఎక్కువగా నమోదైంది. ఇక్కడ ప్రతి లావాదేవీలోనూ వినియోగదారుల నుంచి ‘అదనపు సొమ్ము’ వసూలు చేసే ప్రక్రియ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని నివేదిక విశ్లేషించింది.
→ ఆన్‌లైన్ ట్రావెల్ రంగంలో మేక్‌మైట్రిప్ అత్యంత సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. కాగా క్లియర్‌ట్రిప్ వినియోగదారులకు ఎక్కువ నష్టం చేకూరుస్తున్నట్లు రేటింగ్ పొందింది.
→ క్విక్ కామర్స్ రంగంలో బిగ్‌బాస్కెట్ యాప్ తీవ్రమైన డార్క్ ప్యాటర్న్స్ స్కోరును నమోదు చేసింది.
→ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు ఈ డిజిటల్ మోసాలను అరికట్టడంలో పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయని నివేదిక అభిప్రాయపడింది. అయితే, ఆన్‌లైన్ కొనుగోలుదారుల్లో 74 శాతం మంది పారదర్శకమైన, న్యాయబద్ధమైన డిజైన్ విధానాలను అనుసరించే ప్లాట్‌ఫారమ్‌ల కోసం అవసరమైతే కొంత ఎక్కువ ధర చెల్లించేందుకూ సిద్ధంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.


