
భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ దినిదినాభివృద్ది చెందుతోంది. 2014లో రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న ఈ పరిశ్రమ.. 2025 నాటికి రూ. 22 లక్షల కోట్లకు చేరిందని.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పేర్కొన్నారు. పుదుచ్చేరిలో గ్రేడ్ సెపరేటర్, రోడ్ల విస్తరణ పనులు, కొత్త రోడ్డు ప్రాజెక్టుకు పునాది వేసిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. జపాన్‌ను అధిగమించి మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా ఇండియా అవతరించిందని అన్నారు.
ఆటోమొబైల్ మార్కెట్ పరిమాణం పరంగా అమెరికా, చైనా తర్వాత దేశం ఇప్పుడు మూడవ స్థానంలో ఉంది. ఈ పరిశ్రమ 4.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించింది. ఎగుమతి రంగానికి ఎంతో దోహదపడిందని గడ్కరీ స్పష్టం చేశారు.
దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందని, మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల కారణంగా డిసెంబర్ నాటికి ఇది 9 శాతానికి తగ్గుతుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
వివిధ స్థిరమైన పద్ధతులను అవలంబించడం గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణంలో మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 18 లక్షల టన్నుల మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగించామని, రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వ్యర్థాలను ప్రోత్సహించాలని మంత్రిత్వ శాఖ ప్రణాళిక వేసిందని అన్నారు.
ఇదీ చదవండి: బేబీ బూమర్లు నష్టపోతారు!: రాబర్ట్ కియోసాకి