న్యూఢిల్లీ: సేవల రంగంలో కార్యకలాపాలు నిదానించాయి. సేవల రంగ పనితీరును సూచించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) అక్టోబర్‌లో 58.9 పాయింట్లకు పరిమితమైంది. సెప్టెంబర్‌లో ఇది 60.9 పాయింట్లుగా ఉండడం గమనార్హం. ఈ సూచీ సాధారణంగా 50 పాయింట్లకు పైన ఉంటే విస్తరణగానే పరిగణిస్తుంటారు. ఈ ఏడాది మే తర్వాత సేవల రంగ పీఎంఐ ఇంత తక్కువగా నమోదు కావడం మళ్లీ ఇదే మొదటిసారి.
పోటీపరమైన ఒత్తిళ్లు, భారీ వర్షాలు నెలవారీగా వృద్ధిని నిదానించేలా చేసినట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ చెప్పారు. డిమాండ్ జోరు, జీఎస్‌టీ ఉపశమనంతో నిర్వహణ పరిస్థితులు మెరుగుపడినప్పటికీ, పోటీ, అధిక వర్షాలు వృద్ధికి అడ్డుపడినట్టు చెప్పారు. వచ్చే 12 నెలల కాలంలో వ్యాపార కార్యకలాపాలు బలంగా ఉంటాయన్న విశ్వాసం కంపెనీల నుంచి వ్యక్తమైనట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా పీఎంఐ సర్వే వెల్లడించింది. ఇక అక్టోబర్ నెలకు సంబంధించి తయారీ, సేవల రంగ పనితీరును సూచించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ 60.4గా నమోదైంది. సెపె్టంబర్‌లో 61గా ఉంది.


