రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపు | India Raised Prices Of Natural Gas For The First Time In Two Years, Effective Prices From April 1st | Sakshi
Sakshi News home page

India Natural Gas Price: రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపు

Apr 1 2025 9:23 AM | Updated on Apr 1 2025 10:58 AM

India raised prices of natural gas for the first time in two years

దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు ధరలను భారత్ రెండేళ్లలో తొలిసారిగా పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ఏపీఎం(అడ్మినిస్ట్రేటెడ్ ప్రైసింగ్‌ మెకానిజం) గ్యాస్‌ ధరను 10 లక్షల థర్మల్ యూనిట్లకు 6.50 డాలర్ల నుంచి 6.75 డాలర్లకు పెంచినట్లు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ విభాగం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ), ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లు నామినేషన్ ప్రాతిపదికన కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువును ఏపీఎం గ్యాస్ అంటారు. ఈ గ్యాస్‌ను ‘అడ్మినిస్ట్రేటెడ్ ప్రైసింగ్ మెకానిజం’ వద్ద వినియోగదారులకు విక్రయిస్తారు.

ఇంట్లో వంట అవసరాలకు పైపుల ద్వారా సహజ వాయువుగా ఈ గ్యాస్‌ను సరఫరా చేస్తారు. ఆటోమొబైల్స్ అవసరాల కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌గా మారుస్తారు. ప్రభుత్వం రూపొందించిన రోడ్ మ్యాప్‌కు అనుగుణంగా రెండేళ్లలో తొలిసారి ధరల పెంపును అమలు చేశారు. 2023 ఏప్రిల్‌లో దేశీయంగా ఉత్పత్తి అయిన సహజ వాయువు ధరలను మిలియన్ థర్మల్ యూనిట్లకు 4 డాలర్లు నుంచి గరిష్టంగా 6.5 డాలర్లుగా పరిమితిని విధించారు. ధరల పెంపుకు సంబంధించి నిపుణుల కమిటీ నివేదికను గతంలో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2027 వరకు 0.5 డాలర్లు పెంచాలని సూచించింది. 2023 నుంచి రెండేళ్లపాటు ఎలాంటి పెంపు తీసుకోలేదు. ఈ గడువు ముగియడంతో తాజాగా 0.25 డాలర్ల పెంపు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే రెండేళ్ల పాటు రేట్లు మారవని, ఆ తర్వాత మరో 0.25 డాలర్లు పెంచాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది.

ఇదీ చదవండి: నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు

కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) అనేది అధిక పీడనం వద్ద నిల్వ చేసి ఉపయోగించేందుకు వీలైన గ్యాస్‌. దీన్ని ప్రధానంగా మీథేన్, గ్యాసోలిన్, డీజిల్ లేదా బొగ్గు వంటి సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వినియోగాస్తున్నారు. కార్లు, బస్సులు, ట్రక్కులు, ఆటోరిక్షాలు సహా ఆటోమొబైల్స్‌కు ప్రత్యామ్నాయ ఇంధనంగా సీఎన్‌జీని విస్తృతంగా వాడుతున్నారు. గ్యాసోలిన్ లేదా డీజిల్‌, పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ ఉద్గారాలు విడుదల చేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement