దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు | CNG Prices Hiked India Latest News Updates | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు

May 26 2026 7:53 AM | Updated on May 26 2026 8:51 AM

CNG Prices Hiked India Latest News Updates

వాహనదారులకు వరుస షాకులు తప్పడం లేదు. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పదిరోజుల వ్యవధిలో నాలుగసార్లు.. అదీ భారీగా పెరిగాయి. ఇక ఇప్పుడు కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (CNG) వంతు వచ్చింది. గ్యాస్‌ పంపిణీ సంస్థలు కిలో రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ రేటు మంగళవారం  ఉదయం నుంచే అమల్లోకి వచ్చింది. 

దేశంలో విస్తృతంగా వినియోగంలో ఉన్న సీఎన్‌జీ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీ-NCR రీజియన్‌లో కిలోకు రూ.83 కు చేరింది. మే 15 నుంచి ఇలా పెంచుకుంటూ రావడం ఇది నాలుగోసారి. అంతకు ముందు.. మే 15న రూ2, మే 18న రూ1, మే 23న మరో రూ.1 పెంచాయి. ఇప్పుడు తాజాగా రూ.2 పెంపుతో కేవలం 11 రోజుల్లోనే దాదాపు రూ.6 వరకు ధరలు పెరిగాయి.

సీఎన్‌జీ ధరలు – నగరాల వారీ లిస్ట్ (కేజీకి)
ఢిల్లీ – రూ.83
ముంబై – రూ.81
పుణే – రూ.92.50
నాగ్‌పూర్ – రూ.88.90
అహ్మదాబాద్ – రూ.82.30
వడోదరా – రూ.81.35
గాంధీనగర్ – రూ.76.98
నోయిడా – రూ.85.07
ఫరీదాబాద్ – రూ.88.72
హైదరాబాద్ – రూ.99
విజయవాడ – రూ.93
గుంటూరు – రూ.92
బెంగళూరు – రూ.90
చెన్నై – రూ.91.5
కోల్‌కతా – రూ.93.5

గమనిక: నగరాల వారీ ధరలు గ్యాస్ కంపెనీ + రాష్ట్ర ట్యాక్స్‌లపై ఆధారపడి మారుతాయి

కాలుష్య నియంత్రణ లక్ష్యాలతో ప్రభుత్వాలు సీఎన్‌జీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నది తెలిసిందే. భారత్‌లో ముఖ్యంగా ఢిల్లీ-NCR, ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలతో పాటు టైర్‌ టూ సిటీల్లో, పట్టణాల్లోనూ సీఎన్‌జీ వాహనాల వినియోగం అధికంగా ఉంది. ఆటోలు, క్యాబ్‌లు, నగర బస్సులు వంటి రవాణా రంగం పెద్ద మొత్తంలో ఈ ఇంధనంపై ఆధారపడుతున్నాయి. అయితే ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా.. ఇప్పుడు తక్కువ ఖర్చు ప్రత్యామ్నాయంగా భావించిన సీఎన్‌జీ కూడా పెరుగుతున్న రేట్ల వాహనదారుల్ని బెంబేలెత్తిస్తోంది. 

సీఎన్‌జీ ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కొనసాగుతున్న అనిశ్చితే. పశ్చిమాసియా సంక్షోభం, గ్యాస్‌ సరఫరా మార్గం హర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు, గ్లోబల్ గ్యాస్ ధరల్లో మార్పులు.. ఫలితంగా భారత్ వంటి దేశాల్లో ఎల్‌ఎన్‌జీ (Liquefied Natural Gas) కొనుగోలు( దిగుమతి) ఖర్చు పెరుగుతోంది. తద్వారా ఎల్‌ఎన్‌జీని ప్రాసెస్ చేసి వాహన ఇంధనంగా మార్చే సీఎన్‌జీ సరఫరా వ్యయం కూడా పెరుగుతోందన్నమాట. రవాణా, నిల్వ, పంపిణీ వ్యయాలు పెరుగుతున్నాయి కాబట్టే గ్యాస్ పంపిణీ సంస్థలు రేట్లను సవరించాల్సి వస్తోంది. అయితే అంతిమంగా మాత్రం భారం వాహనదారులపైనే పడుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement