
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాల ఫోకస్
మార్కెట్లో వాటా కోసం పోటాపోటీ
ట్రెండ్స్, డిమాండ్‌పై మరింతగా దృష్టి
అంకుర సంస్థల్లో పెట్టుబడులు
పెంపుడు జంతువులు ఇప్పుడు జీవితంలో, లైఫ్‌స్టయిల్‌లో భాగంగా మారుతున్నాయి. వాటిని కుటుంబ సభ్యులుగా పరిగణిస్తూ, వాటి సంరక్షణ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు జంతుప్రేమికులు సిద్ధంగా ఉంటున్నారు. దీంతో ఖరీదైన ప్యాకేజ్డ్ పౌష్టికాహారం నుంచి సప్లిమెంట్లు, డయాగ్నోస్టిక్స్ సహా పెంపుడు జంతువుల సంరక్షణకు సంబంధించిన పెట్ మార్కెట్ భారీ స్థాయిలో విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా ఈ మార్కెట్ ఏకంగా 7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 60,000 కోట్లు) స్థాయిలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ సంస్థలు కూడా దీనిపై మరింతగా ఫోకస్ పెడుతున్నాయి. మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇటీవలే విప్రో కన్జూమర్ కేర్ వెంచర్స్ సంస్థ గూఫీ టెయిల్స్ అనే సంస్థలో ఇన్వెస్ట్ చేసింది. ఇక డ్రూల్స్‌లో మరో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే వాటాలు కొనుగోలు చేసింది. అలాగే ప్యూరినా అనే సంస్థను కొనుగోలు చేసింది. మరోవైపు, 2022లో క్యానిస్ లూపస్‌లో ఇమామి 30 శాతం వాటాలు కొనుగోలు చేసింది.
అప్పటినుంచి క్రమక్రమంగా పెట్టుబడిని పెంచుకుంటూ వస్తోంది. ఇలా, మార్కెట్‌పై ఆసక్తిగానే ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు ఆచితూచి అడుగేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉన్న సంస్థల్లో మైనారిటీ వాటాలను తీసుకుంటూ మార్కెట్‌ను అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నాయని వివరించాయి. అయితే, డీ2సీ (డైరెక్ట్ టు కన్జూమర్) బ్రాండ్లు విశ్వసనీయతను పెంచుకుంటూ, వృద్ధి చెందే కొద్దీ వాటిని పెద్ద కంపెనీలు కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నాయి. విస్తరణ, లాభదాయకత పెరిగే కొద్దీ తదుపరి దశలో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యే అవకాశాలూ వివరించాయి.
పట్టణీకరణ దన్ను..
వినియోగదారుల ధోరణులే కాకుండా వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ కూడా ఈ విభాగానికి దన్నుగా ఉంటోంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ, ఆదాయాలు ఆర్జిస్తుండటం, కుటుంబ స్వరూపం మారుతుండటం వంటి అంశాలు కూడా కొంత దీనికి దోహదపడుతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తప్పనిసరి కాని అంశాలపై భారీగా ఖర్చు చేయగలిగేంతగా ఆదాయం ఉండే సంపన్న కుటుంబాలు, పెంపుడు జంతువులపై మరింతగా వెచి్చస్తుండటాన్ని ఇది ప్రతిబింబిస్తోందని పేర్కొన్నాయి.
2019–2024 మధ్య కాలంలో దేశీయంగా జంతు సంరక్షణ ఉత్పత్తులు, సేవలు అందించే అంకుర సంస్థలు దాదాపు 121.3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయి. 2021లో 13 డీల్స్ ద్వారా ఏకంగా 56.7 మిలియన్ డాలర్లు సేకరించాయి. 2024లో ఇది 17.4 మిలియన్ డాలర్లుగా ఉంది. బ్లింకిట్, జెప్టోలాంటి క్విక్–కామర్స్ ప్లాట్‌ఫాంలు విస్తరించే కొద్దీ పెట్ ఫుడ్, గ్రూమింగ్ ఉత్పత్తులు నిమిషాల్లో డెలివరీ అవుతున్నాయి. దీని వల్ల మార్కెట్ విస్తరిస్తున్నప్పటికీ, పోటీ కూడా తీవ్రతరమవుతోంది. పెట్ కేర్ ఉత్పత్తులకు క్విక్ కామర్స్ కీలకమైన మాధ్యమంగా మారే అవకాశం ఉండగా, అదే సమయంలో డీ2సీ సంస్థలు తమ బ్రాండ్లను నిలబెట్టుకోవడానికి, వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనేందుకు మరింతగా కసరత్తు చేయాల్సి రానుంది.
ఏటా 15% వృద్ధి..
ఈ విభాగం ఏటా 15 శాతం వృద్ధి చెందుతోందని కన్సల్టెన్సీ సంస్థ ఈవై–పారి్థనాన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత డిమాండ్‌లో పావు వంతు భాగాన్ని భర్తీ చేసేందుకు దిగుమతులపై ఆధారపడాల్సి ఉంటోందని పేర్కొన్నాయి. ఈ అంతరాలను తగ్గించేందుకు పెద్ద బ్రాండ్లు రంగంలోకి దిగుతున్నాయని, దిగుమతులకు ప్రత్యామ్నాయంగా, స్థానికంగా ఉత్పత్తి చేయడంపై దృష్టి పెడుతున్నాయని వివరించాయి. భారతీయ పెట్ పేరెంట్స్ కోసం భారతీయ బ్రాండ్లను తీర్చిదిద్దే అవకాశం ఉండటంతో విప్రో కన్జూమర్ కేర్‌లాంటి సంస్థలు ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయని పేర్కొన్నాయి.
పెట్స్‌ను కుటుంబంలో భాగంగా చూసే ధోరణి పెరుగుతున్న కారణంగా వాటి సంరక్షణపై మరింతగా వెచి్చంచడంపై వినియోగదారులు దృష్టి పెడుతున్నారు. దీంతో ఈ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆహారం, గ్రూమింగ్, డయాగ్నోస్టిక్స్‌లాంటి అన్ని విభాగాల్లోను పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని గూఫీ టెయిల్స్ వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో క్యాట్ ఫుడ్, ఫ్రీజ్–డ్రైడ్ మీల్స్, సప్లిమెంట్లకు మరింత డిమాండ్ నెలకొంటుందనే అంచనాలు ఉన్నట్లు పేర్కొన్నాయి.