
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 12 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా రూ.11.89 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన రూ. 11.18 లక్షల కోట్లతో పోలిస్తే 6 శాతం పెరిగాయి. కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు పెరగడం, రిఫండ్‌లు నెమ్మదించడం ఇందుకు కారణం. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 12 వరకు రిఫండ్‌ల జారీ 16 శాతం తగ్గి రూ. 2.03 లక్షల కోట్లకు పరిమితమైంది.
నికర కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు రూ. 4.92 లక్షల కోట్ల నుంచి రూ. 5.02 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్‌యేతర పన్ను వసూళ్లు రూ. 5.94 లక్షల కోట్ల నుంచి రూ. 6.56 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక సమీక్షాకాలంలో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ) వసూళ్లు రూ. 30,630 కోట్ల నుంచి రూ. 30,878 కోట్లకు చేరాయి. రిఫండ్‌లను సర్దుబాటు చేయకముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2.36 శాతం పెరిగి రూ. 13.92 లక్షల కోట్లకు చేరాయి.
ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్‌డ్రా!