ఎగుమతులు భేష్‌..! | India May exports rise 18 percent to 45. 2 billion Dollars | Sakshi
Sakshi News home page

ఎగుమతులు భేష్‌..!

Jun 16 2026 5:19 AM | Updated on Jun 16 2026 5:19 AM

India May exports rise 18 percent to 45. 2 billion Dollars

మేలో 45 బిలియన్‌ డాలర్లు 

ఆరు నెలల గరిష్టానికి చేరిక 

దిగుమతులు 10 శాతం అధికం 

పెరిగిన వాణిజ్య లోటు

న్యూఢిల్లీ: వస్తు ఎగుమతులు మేలో పటిష్ట పనితీరు చూపించాయి. ఆరు నెలల గరిష్ట స్థాయిలో 45.2 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దిగుమతులు సైతం 10 శాతం పెరిగి 73.41 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్యలోటు (ఎగుమతులను మించి దిగుమతుల విలువ పెరగడం కారణంగా ఏర్పడేది) 28.21 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. గతేడాది మే నెలలో వాణిజ్యలోటు 21.88 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. 

ముడి చమురు, ఎరువుల కోసం అధికంగా వెచ్చించాల్సి రావడం దిగుమతుల బిల్లు పెరిగేందుకు కారణమవుతోంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లోనూ దేశ ఎగుమతులు మెరుగైన వృద్ధిని చూసినట్టు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది ఎగుమతుల్లో మెరుగైన వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్రక్టానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్‌ వస్తువులు, ఫార్మా ఎగుమతుల వృద్ధిలో కీలకపాత్ర పోషించాయి. మరోవైపు మేలో సేవల ఎగుమతులు 36.76 బిలియన్‌ డాలర్లు, సేవల దిగుమతులు 19.06 బి. డాలర్లుగా ఉండొచ్చన్నది ప్రభుత్వం అంచనా.  

మొదటి రెండు నెలల్లో మంచి పనితీరు 
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్‌–మే) ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 16.09 శాతం పెరిగి 88.91 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 15.14 శాతం జంప్‌ చేసి 145.35 బిలియన్‌ డాలర్ల మేర ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 56.44 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  
 
పసిడి దిగుమతులు ఎక్కువే.. 
ఏప్రిల్, మే నెలలో 9.40 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు దేశంలోకి వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 60 శాతం పెరిగాయి. పసిడి, వెండి దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు కేంద్రం ఇటీవలే వాటిపై కస్టమ్స్‌ డ్యూటీని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం తెలిసిందే. ముడిచమురు దిగుమతుల విలువ సైతం 16.5 శాతం పెరిగి 41.3 బిలియన్‌ డాలర్లకు చేరింది.  

పశ్చిమాసియాకు మెరుగైన ఎగుమతులు 
పశ్చిమాసియాలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ ప్రాంతానికి మే నెలలో ఎగుమతులు గతేడాది మే స్థాయికి చేరినట్టు రాజేష్‌ అగర్వాల్‌ వెల్లడించారు.  2025 మేలో 5.38 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, ఈ ఏడాది అదే నెలలో 5.30 బిలియన్‌ డాలర్ల మేర ఆ ప్రాంతానికి ఎగుమతయ్యాయి. ఒమన్‌కు చెందిన దుక్‌్మ, సోహార్, సలాలా పోర్టుల ద్వారా భారత్‌ తన ఎగుమతులను పెంచుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement