
ఈ ఏడాది మరో 25 శాతం వృద్ధి
ఫాలోయర్ల కన్నా కంటెంట్ నాణ్యతకే తయారీ రంగ ప్రాధాన్యత
విశ్వసనీయతకు పెద్దపీట
ఇండియా ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశీయంగా ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పరిశ్రమ 2024లో రూ. 3,600 కోట్ల స్థాయికి చేరింది. 2025లో ఇది మరో 25 శాతం వృద్ధి చెందనుంది. ది గోట్ ఏజెన్సీ, డబ్ల్యూపీపీ మీడియా, కాంటార్ కలిసి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
భారత్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ తీరుతెన్నులు, వినియోగదారుల ధోరణులను మార్చేందుకు .. బ్రాండ్‌పై విశ్వసనీయతను పెంచుకునేందుకు కంపెనీలు ఏ విధంగా తమ మార్కెటింగ్ వ్యూహాల్లో ఇన్‌ఫ్లుయెన్సర్లను భాగం చేసుకుంటున్నాయి లాంటి అంశాలను ఇది వివరించింది.
దీని ప్రకారం ఈ పరిశ్రమలో ప్రధానంగా ఫాలోయర్ల సంఖ్యపైనే దృష్టి పెట్టే ధోరణిలో మార్పులు వస్తున్నాయి. బ్రాండ్లు ఎక్కువగా కంటెంట్ నాణ్యత, క్రియేటర్ల ఔచిత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా తయారీ రంగంలో ఇలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. ఈ విభాగంలో 85 శాతం బ్రాండ్లు ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంపికలో కంటెంట్ నాణ్యత ప్రాథమిక ప్రాతిపదికగా ఉంటున్నట్లు వివరించాయి.
దీర్ఘకాలిక భాగస్వామ్యానికి మొగ్గు..
నివేదిక ప్రకారం ఇన్‌ఫ్లుయెన్సర్లతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు బ్రాండ్లు మొగ్గు చూపుతున్నాయి. 72 శాతం బ్రాండ్లు ఇలాంటి భాగస్వామ్యాలను ఎంచుకున్నాయి. కంటెంట్ నియంత్రణ, బ్రాండ్ భద్రత రీత్యా 95 శాతం బ్రాండ్లు పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంచుకుంటున్నాయి. అయితే, విశిష్టమైన రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఆటోమోటివ్, కన్జూమర్ డ్యూరబుల్స్‌లాంటి విభాగాల్లో డిమాండ్
ఉంటోంది.
సవాళ్లు ఉన్నాయి...
→ సానుకూలాంశాలు అనేకం ఉన్నప్పటికీ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌లో సవాళ్లు కూడా ఉంటున్నాయి. సరైన ఇన్‌ఫ్లుయెన్సర్లను దొరకపుచ్చుకోవడం ప్రధాన సవాలుగా ఉంటోంది. 83 శాతం మార్కెటర్లు, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాలు) సెక్టార్లో 95 శాతం సంస్థలు సరైన టాలెంట్‌ను దొరకపుచ్చుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వివరించాయి. పెట్టుబడులపై రాబడులను (ఆర్‌వోఐ) లెక్కించేందుకు మార్కెటర్లు ఎక్కువగా ఎంగేజ్‌మెంట్ రేట్ (39 శాతం), కంటెంట్ నాణ్యత (36 శాతం)కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
→ వినియోగదారుల కోణం నుంచి చూస్తే కొనుగోలు ప్రస్థానంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లను ప్రోడక్ట్ డిస్కవరీ కోసం (63 శాతం మంది), సమాచార సేకరణ కోసం (69 శాతం మంది) ఫాలో చేస్తున్నట్లు భారతీయ వినియోగదారులు తెలిపారు.
→ ఇన్‌ఫ్లుయెన్సర్లతో చేతులు కలపడంలో విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు 70 శాతం బ్రాండ్లు తెలిపాయి. బీఎఫ్‌ఎస్‌ఐలో ఇది 77 శాతంగా ఎఫ్‌ఎంసీజీలో ఇది 76 శాతంగా ఉంది.
→ నేటి వినియోగదారులు కేవలం ప్రోడక్టుల కొనుగోలుకే కాకుండా, స్టోరీలు, కమ్యూనిటీలు, తాము విశ్వసించే క్రియేటర్లు చెప్పే విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇన్‌ఫ్లుయెన్సర్లను వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరించే బ్రాండ్లే రాణిస్తాయి. నియంత్రణలు, కంటెంట్‌పై ఫోకస్ పెరుగుతున్న పరిస్థితుల్లో బ్రాండ్లు, క్రియేటర్లు అర్థవంతమైన, దీర్ఘకాలం నిలబడే భాగస్వామ్యాలను ఏర్పర్చుకోవడం కీలకంగా నిలుస్తుంది.