breaking news
Marketing Sector
-
ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రంగం @ రూ. 3,600 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పరిశ్రమ 2024లో రూ. 3,600 కోట్ల స్థాయికి చేరింది. 2025లో ఇది మరో 25 శాతం వృద్ధి చెందనుంది. ది గోట్ ఏజెన్సీ, డబ్ల్యూపీపీ మీడియా, కాంటార్ కలిసి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ తీరుతెన్నులు, వినియోగదారుల ధోరణులను మార్చేందుకు .. బ్రాండ్‌పై విశ్వసనీయతను పెంచుకునేందుకు కంపెనీలు ఏ విధంగా తమ మార్కెటింగ్ వ్యూహాల్లో ఇన్ఫ్లుయెన్సర్లను భాగం చేసుకుంటున్నాయి లాంటి అంశాలను ఇది వివరించింది. దీని ప్రకారం ఈ పరిశ్రమలో ప్రధానంగా ఫాలోయర్ల సంఖ్యపైనే దృష్టి పెట్టే ధోరణిలో మార్పులు వస్తున్నాయి. బ్రాండ్లు ఎక్కువగా కంటెంట్ నాణ్యత, క్రియేటర్ల ఔచిత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా తయారీ రంగంలో ఇలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. ఈ విభాగంలో 85 శాతం బ్రాండ్లు ఇన్ఫ్లుయెన్సర్ల ఎంపికలో కంటెంట్ నాణ్యత ప్రాథమిక ప్రాతిపదికగా ఉంటున్నట్లు వివరించాయి. దీర్ఘకాలిక భాగస్వామ్యానికి మొగ్గు.. నివేదిక ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు బ్రాండ్లు మొగ్గు చూపుతున్నాయి. 72 శాతం బ్రాండ్లు ఇలాంటి భాగస్వామ్యాలను ఎంచుకున్నాయి. కంటెంట్ నియంత్రణ, బ్రాండ్ భద్రత రీత్యా 95 శాతం బ్రాండ్లు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లను ఎంచుకుంటున్నాయి. అయితే, విశిష్టమైన రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న ఇన్ఫ్లుయెన్సర్లకు ఆటోమోటివ్, కన్జూమర్ డ్యూరబుల్స్లాంటి విభాగాల్లో డిమాండ్ ఉంటోంది. సవాళ్లు ఉన్నాయి... → సానుకూలాంశాలు అనేకం ఉన్నప్పటికీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌లో సవాళ్లు కూడా ఉంటున్నాయి. సరైన ఇన్ఫ్లుయెన్సర్లను దొరకపుచ్చుకోవడం ప్రధాన సవాలుగా ఉంటోంది. 83 శాతం మార్కెటర్లు, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాలు) సెక్టార్లో 95 శాతం సంస్థలు సరైన టాలెంట్‌ను దొరకపుచ్చుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వివరించాయి. పెట్టుబడులపై రాబడులను (ఆర్వోఐ) లెక్కించేందుకు మార్కెటర్లు ఎక్కువగా ఎంగేజ్మెంట్ రేట్ (39 శాతం), కంటెంట్ నాణ్యత (36 శాతం)కు ప్రాధాన్యత ఇస్తున్నారు. → వినియోగదారుల కోణం నుంచి చూస్తే కొనుగోలు ప్రస్థానంలో ఇన్ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లను ప్రోడక్ట్ డిస్కవరీ కోసం (63 శాతం మంది), సమాచార సేకరణ కోసం (69 శాతం మంది) ఫాలో చేస్తున్నట్లు భారతీయ వినియోగదారులు తెలిపారు. → ఇన్ఫ్లుయెన్సర్లతో చేతులు కలపడంలో విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు 70 శాతం బ్రాండ్లు తెలిపాయి. బీఎఫ్ఎస్ఐలో ఇది 77 శాతంగా ఎఫ్ఎంసీజీలో ఇది 76 శాతంగా ఉంది. → నేటి వినియోగదారులు కేవలం ప్రోడక్టుల కొనుగోలుకే కాకుండా, స్టోరీలు, కమ్యూనిటీలు, తాము విశ్వసించే క్రియేటర్లు చెప్పే విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇన్ఫ్లుయెన్సర్లను వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరించే బ్రాండ్లే రాణిస్తాయి. నియంత్రణలు, కంటెంట్‌పై ఫోకస్ పెరుగుతున్న పరిస్థితుల్లో బ్రాండ్లు, క్రియేటర్లు అర్థవంతమైన, దీర్ఘకాలం నిలబడే భాగస్వామ్యాలను ఏర్పర్చుకోవడం కీలకంగా నిలుస్తుంది. -
జ్ఞాపకాల అంగడి
వీటిలో ఎన్నిటిని గుర్తుపట్టారు? ఓ మై గుడ్నెస్ అన్నిటినా? అయితే మీరు పలు బ్రాండ్లకు మంచి బిజినెస్ ఇస్తున్నట్టే! వాట్ ఆర్ యూ టాకింగ్? ఇవి నా చిన్నప్పటి.. లేదా నా యూత్ మెమొరీస్.. వాటిని బ్రాండ్స్ ఏం చేసుకుంటాయి? బిజినెస్ చేసుకుంటాయి! ఎస్.. ఇప్పుడు వినియోగదారుల చిన్ననాటి.. టీనేజ్ జ్ఞాపకాలే పలు వ్యాపార సంస్థలకు పెద్ద బిజినెస్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ జ్ఞాపకాలే కొత్త బిజినెస్‌కు ఆలోచన పడేలా చేస్తున్నాయి.. నోస్టాల్జియాకున్న పవర్ అది! అందుకే దీన్ని నోస్టాల్జియా మార్కెట్ అంటున్నారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ తిరుగుతోంది ఈ ఇరుసు మీదే! ఇంట్లో.. బయటా.. ఎక్కడ ఏ వస్తువు కనపడినా.. ఏ పరిసరంలో తిరుగాడినా.. ఏ మాటలు.. పాటలు విన్నా.. అవన్నీ ఏదోరకంగా జ్ఞాపకాలతో ముడిపడి ఉన్నవే అయ్యుంటాయి! లేదంటే గతంలోని ఏదో ఒక సందర్భాన్ని.. అపూర్వ క్షణాలను.. వ్యక్తులను గుర్తుచేసేవే ఉంటాయి! గమ్మత్తయిన ఓ వర్ణం.. అమ్మకు తను కట్టుకున్న తొలి చీరను గుర్తుచేయొచ్చు. మనవరాలో.. మనవడో.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని మరీ కొనుక్కున్న ఓ స్టీల్ గిన్నె.. నానమ్మకు తన కాపురాన్ని జ్ఞాపకంలోకి తేవచ్చు. స్పాటిఫైలో పాట.. నాన్నకు తన బాల్యంలోని సినిమా థియేటర్ని అతని కళ్లముందు ఉంచొచ్చు. పఫ్‌తో హెయిర్ స్టయిల్ అత్తను తన యవ్వనపు రోజుల్లోకి తీసుకెళ్లొచ్చు. ఓటీటీ సిరీస్‌లోని ఓ సన్నివేశంతో తన చిన్నప్పుడు దొంగతనంగా కాల్చిన సిగరెట్ దమ్ము.. తాతయ్య మది అట్టడుగు పొరల్లోంచి బయటకు రావచ్చు! ఇలా జ్ఞాపకల్లేని జీవితం ఉంటుందా? పైగా పాతవన్నీ మధురాలే! అందుకే కదా అన్నారు ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని! ఈ మాటనే వ్యాపార మంత్రంగా పట్టేసుకున్నాయి పలు వ్యాపార సంస్థలు. ఎలాగంటే.. ‘ఆరోజుల్లో... ’ అని మొదలుపెట్టే సంభాషణతో చుట్టూ ఉన్న వాళ్లు చిరాకు పడుతుండొచ్చు. విసుగు చెందుతుండొచ్చు. కానీ.. వ్యాపార సంస్థలు మాత్రం ఆ మాటల ప్రవాహాన్ని పట్టుకుని అందులో ఈది.. ఆ జ్ఞాపకాల్లో తమ బ్రాండ్స్‌ను దొరకబుచ్చుకుని పాత కొత్తల కలయికతో రీమేక్ చేసి యాడ్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ఈ ‘యాది’ అనే టెక్నిక్‌ను బిజినెస్ ట్రిక్‌గా మలచుకుంటున్నాయి. ఈ స్క్రిప్ట్‌కి లీడ్ అందింది ఎప్పుడు? ఇంకెప్పుడూ.. కరోనా టైమ్‌లోనే! భలేవారే.. అన్నిటికీ కరోనాతో ముడిపెడితే ఎలా? అంటే పెట్టాల్సిందే మరి! కరోనాతో కరెంట్ ఎరా.. కరోనాకు ముందు.. తర్వాత అని చీలిపోతుందని లాక్డౌన్లో జోస్యం చెప్పుకున్నాం! నెమ్మదిగా అదిప్పుడు అనుభవంలోకి వస్తోంది. మార్కెట్లో లాభాలు సృష్టిస్తోంది. అంటే కాలం ఆ విభజనను స్పష్టం చేసిందన్నట్టే కదా! లాక్డౌన్లో చాలా మంది.. నాటి దూరదర్శన్ సీరియళ్లు, పాత సినిమాలు, పాటలతోనే కాలక్షేపం చేశారుట. ఆ కాలక్షేపంలో పల్లీ బఠాణీలు, పాప్‌కార్న్‌ని కాకుండా ఆ సీరియళ్లతో సమానంగా ఆస్వాదించిన నాటి ప్రకటనలను.. ప్రొడక్ట్స్‌ను.. వాటి తాలూకు తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారని పలు అధ్యయనాల సారాంశం. ఆ సారాన్ని పట్టుకునే వ్యాపార సంస్థలు నోస్టాల్జియాలో మార్కెట్‌ను వెదుక్కున్నాయి. మిలెనీయల్స్కీ.. జెన్జెడ్కీ.. ఆ తరపు మెమోరీస్‌ని కొత్త ర్యాపర్లో చుట్టి ప్రకటనల గిఫ్ట్స్‌ని అందిస్తున్నాయి. ఈ జాబితాలో క్రెడ్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి క్యాడ్బరీ దాకా పలు ప్రముఖ బ్రాండ్స్ చాలానే ఉన్నాయి. ఇవి ఇలా కొత్త ర్యాపర్లో పాత యాడ్స్‌ను చుట్టి స్క్రీన్ మీద పరుస్తున్నాయి. ఆ మధురాలు పాత తరపు వినియోగదారుల భావోద్వేగాలతో కనెక్ట్ అయ్యి నాటి ఆనందానుభూతులను తాజా చేసి ఆ బ్రాండ్స్ పట్ల వాళ్ల లాయల్టీని పెంచుతున్నాయి. ఈ తరమేమో ఆ గిమ్మిక్కి పడిపోయి.. ఆ బ్రాండ్స్‌కి కొత్త కన్జూమర్స్గా రిజిస్టర్ అవుతోంది. ఇలా ఒకే ఇంట్లో ఆబాలగోపాలన్ని అలరించి.. మెప్పించి తమ ఖాతాను స్థిరపరచుకుంటున్నాయి. ఇదే కాక క్రెడ్ ఓజీ (OG) పేరుతో రాహుల్ ద్రవిడ్, వెంకటేశ్ ప్రసాద్, జావగల్ శ్రీనాథ్, మనీందర్ సింగ్, సబా కరీమ్ లాంటి నాటి మేటి క్రికెటర్స్తోనూ యాడ్స్ రూపొందించింది. ఇలా రిలీజ్ అయిన వెంటనే అలా వైరల్ అయ్యాయి ఆ ప్రకటనలు. ఆ యాడ్స్‌లో కొన్ని.. క్యాడ్బరీ.. కుఛ్∙ఖాస్ హై 90ల్లో.. ఒక క్రికెటర్ బ్యాటింగ్ చేస్తుంటాడు.. సెంచరీకి చివరి బంతి అన్నమాట. బంతి గాల్లో లేచి.. క్యాచ్ అవుతుందా అన్న ఉత్కంఠలో క్యాచ్ మిస్ అయ్యి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్బరీ చాక్లెట్ తింటూ టెన్షన్ పడ్డ అతని గర్ల్‌ఫ్రెండ్ ఆనందానికి అవధులుండవు. అలాగే చాక్లెట్ తింటూ డాన్స్ చేస్తూ స్టేడియంలోకి వస్తుంది.. సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! ఇప్పుడు క్రికెట్ స్టేడియం.. లేడీ క్రికెటర్ బ్యాటింగ్ చేస్తుంటుంది. సెంచరీకి ఒక రన్ తక్కువగా ఉంటుంది ఆమె స్కోర్. ఓ షాట్ కొడుతుంది. అది గాల్లో లేచి.. బౌండరీ దగ్గరున్న ఫీల్డర్ దోసిట్లో పడబోయి.. మిస్ అయి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్బరీ తింటూ టెన్షన్ పడిన ఆ క్రికెటర్ బాయ్‌ఫ్రెండ్ సంతోషానికి ఆకాశమే హద్దవుతుంది. అలాగే చాక్లెట్ తింటూ డాన్స్ చేసుకుంటూ స్టేడియంలోకి వస్తాడు సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. ఫైవ్స్టార్తో కలసి అప్పుడు.. ఫైవ్‌స్టార్ ఇద్దరు యువకులు.. ఓ ప్యాంట్‌ను దర్జీకిస్తూ ‘నాన్నగారి ప్యాంట్.. ఒక అంగుళం పొడవు తగ్గించాలి’ అని చెప్పి వాళ్ల వాళ్ల షర్ట్ జేబుల్లోంచి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తీసి ఓ బైట్ తిని .. ఆ ఇద్దరూ మొహాలు చూసుకుని అప్పుడే ఒకరినొకరు గుర్తుపట్టినట్టు.. ‘రమేశ్.. సురేశ్’ అని పిలుచుకుంటారు. ఇలా చాక్లెట్ తింటూ.. మైమరిచిపోయి.. దర్జీకి పదేపదే ఆ ప్యాంట్‌ను అంగుళం చిన్నది చేయమని పురమాయిస్తూంటారు. ఈలోపు ఆ ప్యాంట్ కాస్త నిక్కర్ అయిపోతుంది. ఇప్పుడు.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇందులోనూ రమేశ్, సురేశ్ ఇద్దరూ ఓ ప్యాంట్ తీసుకుని దర్జీ దగ్గరకు వస్తారు. ఆ ప్యాంట్ పొడవు తగ్గించాలని పురమాయించి.. ఫైవ్‌స్టార్ కోసం జేబులు వెదుక్కుంటూంటారు.. ఖాళీ అయిపోయిన ర్యాపర్స్ తప్ప చాక్లెట్స్ దొరకవు. అప్పుడు వాయిస్ ఓవర్ వినిపిస్తుంటుంది.. ‘ఇప్పటికిప్పుడు చాక్లెట్స్ కావాలా? స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి.. నిమిషాల్లో చాక్లెట్స్ మీ ముందుంటాయి’ అంటూ! అప్పుడు రమేశ్.. సురేశ్ పక్కకు చూడగానే చాక్లెట్స్ పట్టుకుని నిలబడ్డ స్విగ్గీ ఇన్స్టామర్ట్ డెవలరీ పర్సన్ కనపడుతుంది. క్రెడ్.. (క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ యాప్) నాడు.. దీపికాజీ (నిర్మా వాషింగ్ బార్) దీపికా చిఖలియా (నాటి టీవీ రామాయణంలో సీత పాత్రధారి) కిరాణా షాప్‌లోకి వెళ్లి.. నిర్మా బట్టల సబ్బు ఇవ్వమని షాప్ అతన్ని అడుగుతుంది. ‘దీపికాజీ.. మీరెప్పుడూ సాధారణ సబ్బే కదా తీసుకునేది.. మరిప్పుడూ?’ అంటూ ఆగిపోతాడు. ‘సాధారణ సబ్బు ధరకే నిర్మా బార్ వస్తుంటే ఎందుకు కాదనుకుంటాను’ అంటుంది దీపికా. నేడు .. కరిష్మాజీ (క్రెడ్ పేమెంట్ యాప్ కోసం) షాప్‌లోకి వెళ్తుంది కరిష్మా కపూర్ సెల్‌ఫోన్ చార్జర్ కోసం. సాధారణమైన చార్జర్ కాక స్టాండర్డ్ చార్జర్ అడుగుతుంది. ‘కారిష్మాజీ.. మీరు సాధారణంగా మామూలు చార్జరే అడుగుతారు కదా.. మరిప్పుడు?’ అని ఆగుతాడు. సాధారణ చార్జర్ ధరకే క్రెడ్ బౌంటీ స్టాండర్డ్ చార్జర్ ఇస్తుండగా ఎందుకు కాదంటాను!’ అంటుంది. పార్లే జీ.. భారత్ కా అప్ నా బిస్కట్ (ఈ దేశపు సొంత బిస్కట్ ) నిరుటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్లే జీ ‘ భారత్ కా అప్నా బిస్కట్ (ఈ దేశపు సొంత బిస్కట్)’ పేరుతో నోస్టాల్జియా క్యాంపెయిన్ యాడ్‌ను విడుదల చేసింది. ‘స్వాతంత్య్ర సమర ప్రయాణంలో మేమూ కలసి నడిచాం! చాయ్ తీపిని.. స్వాతంత్య్ర సాధన సంతోషాన్నీ రెట్టింపు చేశాం! దేశం సాధించిన ప్రతి విజయంలో భాగస్వాములమయ్యాం..’ అంటూ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు దేశం సాధించిన ప్రగతిని చూపిస్తూ.. అప్పటి నుంచీ ఉన్న తన ఉనికినీ ప్రస్తావిస్తూ .. నాటి జ్ఞాపకాల వరుసలో తనను ముందు నెలబెట్టుకుని.. ఇప్పటికీ అంతే తాజాగా ఉన్నానని చెబుతూ తన ప్రొడక్ట్ అయిన బిస్కట్స్‌ను మిలెనీయల్స్ చేతుల్లో ఉన్న చాయ్ కప్పుల్లో.. పాల గ్లాసుల్లోనూ డిప్ చేసింది. టాటా సాల్ట్ కూడా బాక్సర్ మేరీ కోమ్‌ను పెట్టి.. ‘దేశ్ కా నమక్’ పేరుతో నోస్టాల్జియా, సెంటిమెంట్‌ను కలిపి కొట్టి కమర్షియల్ యాడ్‌ను రూపొందించింది. అది వర్కవుట్ అయింది. మదర్స్ రెసిపీ కూడా తన పచ్చళ్ల వ్యాపార ప్రమోషన్‌కు జ్ఞాపకాల ఊటనే వాడుకుంది. దిన పత్రికలూ నోస్టాల్జియా ప్రకటనలనే నమ్ముకున్నాయి. అందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా ‘హ్యాకీ చాంపియన్’ యాడే ఉదాహరణ. ఇవేకాక పేపర్ బోట్, గూగుల్ వంటి న్యూజనరేషన్ కంపెనీలూ నోస్టాల్జియాను ప్లే చేశాయి. రీలాంచ్ కూడా నోస్టాల్జియాతో ప్రొడక్ట్ ప్రకటలనే కాదు ప్రొడక్షన్ ఆగిపోయిన వస్తువులనూ తిరిగి ఉత్పత్తి చేస్తున్నాయి కొన్ని సంస్థలు. వాటిల్లో పార్లే వాళ్ల రోలా కోలా ఒకటి. 80లు, 90ల్లో పిల్లలకు ఈ క్యాండీ సుపరిచితం. పదమూడేళ్లుగా ఇది ఆగిపోయింది. కానీ దీనితో ముడిపడున్న తీపి జ్ఞాపకాలు మాత్రం 80, 90ల్లోని పిల్లలతో పాటే పెరిగి స్థిరపడ్డాయి. అందుకే నాలుగేళ్ల కిందట.. కేరళకు చెందిన 29 ఏళ్ల సిద్ధార్థ్ సాయి గోపినాథ్ అనే యువకుడు రోలా కోలా ఫొటో పెట్టి.. దాన్ని పార్లేకి ట్యాగ్ చేస్తూ ఇది మళ్లీ మార్కెట్లోకి రావాలంటే ఎన్ని రీట్వీట్స్ కావాలంటూ ట్వీట్ చేశాడు. అతని ట్వీట్‌కి పార్లే స్పందించింది. కనీసం పదివేల రీట్వీట్స్ కావాలని బదులిచ్చింది. అయిదారు నెలలకు సిద్ధార్థ కోరిక నెరవేరింది. ‘మంచి ఫలితానికి నిరీక్షణ తప్పదు.. కానీ నిరీక్షణ ఫలితమెప్పుడూ తీయగానే ఉంటుంది.. రోలా కోలా ఈజ్ కమింగ్ బ్యాక్’ అంటూ పార్లే ప్రకటించింది. సిద్ధార్థ్ ఈ రోలా కోలా కోసం ట్యాగ్ చేయని సెలబ్రిటీల్లేరు.. మెగా బ్రాండ్స్ లేవు. ఆఖరకు నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఏవియేషన్ కంపెనీలనూ వదల్లేదు. కాంపా కోలా.. 1970, 80ల్లో తన టేస్ట్‌తో మార్కెట్‌ను రిఫ్రెష్ చేసిన సాఫ్ట్‌డ్రింక్ ఇది. గ్లోబలైజేషన్‌తో మన అంగట్లోకి వచ్చిన పెప్సీ, రీ ఎంటర్ అయిన కోకా కోలా థండర్ వేవ్స్‌కి తట్టుకోలేక దేశీ సాఫ్ట్‌డ్రింక్ కాంపా కోలా కనుమరుగైపోయింది. దీన్నిప్పుడు రిలయెన్స్ కొనుగోలు చేసింది.. దేశీ డ్రింక్‌గా నాటి జ్ఞాపకాల చల్లదనంతో వినియోగదారులను సేదతీర్చడానికి సిద్ధమైంది. మ్యాగీ ఏమైనా తక్కువ తిందా? నిర్ధారిత పరిమాణం కన్నా సీసం పాళ్లు ఎక్కువున్నాయన్న కంప్లయింట్‌తో నెస్లే ప్రొడక్ట్ మ్యాగీ మన వంటింటి కప్‌బోర్డులను ఖాళీ చేసి వెళ్లిపోయింది. వెళ్లింది వెళ్లినట్టు ఊరుకుందా? లేదు! పిల్లల ఆకలి తీర్చిన ఇన్స్టంట్ ఫుడ్ జ్ఞాపకాలను రెచ్చగొట్టింది.. మిస్ యూ.. కబ్ వాపస్ ఆయేగా యార్ (తిరిగి ఎప్పుడొస్తున్నావ్) అంటూ! ప్రకటనలు, నలుమూలలా హోర్డింగ్‌లతో హోరెత్తించింది. ఈ ఉత్సాహం, స్ఫూర్తితో చాలా కంపెనీలు.. షటర్ మూసుకున్న తమ ప్రొడక్ట్స్‌ని కొత్తగా ముస్తాబు చేసి తిరిగి మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయట. కొత్తేం కాదు.. నోస్టాల్జియాతో మార్కెట్‌ను ఏలడం కొత్త అనుకుంటున్నాం కానీ.. కాదు. ఫ్యాషన్ ప్రపంచం ఫాలో అయ్యేది ఈ సూత్రాన్నే! బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్‌మన్ కలర్ కాలం నాటి ట్రెండ్స్‌ని రెట్రో స్టయిల్ పేరుతో ఎప్పటికప్పుడు మార్కెట్ చేయట్లేదూ..! అలా బెల్‌బాటమ్, త్రీ ఫోర్ హ్యాండ్స్ బ్లౌజెస్, పోల్కా డాట్స్ డిజైన్స్, ఫ్రెంచ్ కట్ బియర్డ్స్, పఫ్ కొప్పులు ఎట్సెట్రా లేటెస్ట్ ఫ్యాషన్‌గా ఎన్ని యూత్‌ని ఆకట్టుకోవడం లేదు! ఆధునిక సాంకేతికతకు కవల జంటలైన ‘ఈ’ జెనరేషన్కూ త్రోబ్యాక్ సుపరిచితమే సోషల్ మీడియా సాక్షిగా. నిజానికి ప్రస్తుతం పలు బ్రాండ్స్ చేస్తున్న ఈ నోస్టాల్జియా మార్కెట్‌కి ప్రేరణ సోషల్ మీడియా త్రోబ్యాక్ థర్స్డేతోపాటు అది పోస్ట్ అయిన పాస్ట్ ఈవెంట్స్.. ఇన్సిడెంట్స్లను తడవ తడవకు గుర్తుచేసే తీరే అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ స్ట్రాటెజీ వల్ల పలు బ్రాండ్ల అమ్మకాలూ పెరిగాయనీ చెప్తున్నారు. ‘జ్ఞాపకాలనేవి భలే గిరాకీ బేరం. నాటి సంగతులను మంచి ఫీల్‌తో జత చేసుకుని వస్తాయి. ఎన్నటికీ ఇంకిపోని భావోద్వేగాల తడిని కలిగుంటాయి. కాబట్టే అవి మార్కెట్లో సేల్ అవుతున్నాయి’ అంటున్నారు ‘22ఫీట్ ట్రైబల్ వరల్డ్‌వైడ్’ నేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ దేబాశీష్ ఘోష్. ‘టీబీడబ్ల్యూఏ ఇండియా’ సీసీఓ పరీక్షిత్ భట్టాచార్యేమో ‘నోస్టాల్జియా అనేది టైమ్ మెషిన్ లాంటిది. నడుస్తున్న కాలానికి అందులో యాక్సెస్ ఉండదు. మళ్లీ మళ్లీ అనుభూతి చెందాలనుకున్న క్షణాల్లోకి అది మనల్ని తీసుకెళ్తుంది.. మళ్లీ జీవించేలా చేస్తుంది. ఆ బలహీనతనే కంపెనీలు ఎన్‌క్యాష్ చేసుకుంటున్నాయి’ అంటున్నారు. అయితే ఈ ప్రహసనంలో కొన్ని బ్రాండ్స్.. పాత ప్రకటన లేదా జ్ఞాపకానికి సమకాలీనతను జోడించే ప్రయత్నంలో వాటికున్న ఎసెన్స్‌ను కాపాడుతూ ఆధునికతను అద్దడంలో విఫలమవు తున్నాయి. పాత యాడ్స్.. ఆ కాలంలో అద్భుతంగా ఉండి ఉండొచ్చు. అంతే అద్భుతమైన ఫలితాలనూ రాబట్టి ఉండొచ్చు. కాని వాటి విలువ సామాజికంగా కానీ.. కల్చర్ పరంగా కానీ ప్రాసంగికతను కలిగి ఉందా? దాన్ని నేటి తరం గ్రహించగలుగుతున్నదా? ఆ ప్రకటనల సారం నేటికీ సరిపోలనున్నదా అన్నదాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటి కొన్ని యాడ్స్‌ను ఇప్పుడు చూస్తే అంటే పరిణతి చెందిన ఆలోచనాతీరుతో.. ఇప్పుడు నెలకొని ఉన్న సున్నిత వాతావరణంలో పరికిస్తే అవి వివాదాస్పదంగా కనిపించవచ్చు. పురుషాధిపత్య ధోరణినీ చూపిస్తూండవచ్చు. కాబట్టి.. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని పాత ప్రకటనలకు ఆ సెన్స్‌ను జోడించాకే నోస్టాల్జియా స్ట్రాటెజీని మార్కెట్ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
విజయపథం: ఆలోచనే ఆదాయం
చిన్నప్పుడెప్పుడో స్నేహితురాలికి సినిమా కథ చెప్పింది రమ్య. ఆ స్నేహితురాలు మరుసటిరోజే సినిమా చూసింది. ‘ఆ సినిమా కంటే నువ్వు చెప్పిన విధానమే బాగుంది’ అని రమ్యకు కితాబు ఇచ్చింది. ప్రతిభ వృథా పోదు అంటారు. రమ్యలోని ప్రతిభ కూడా అంతే. ఒక అంశాన్ని ఆకర్షణీయంగా చెప్పే ఆమె ప్రతిభ మార్కెటింగ్ రంగంలో తనకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ‘రమ్య రామచంద్రన్... యంగ్ ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఎంటర్ప్రెన్యూర్’గా గుర్తింపు తెచ్చుకోవడానికి ఉపయోగపడింది. ‘హుపల్’ పేరుతో ముంబై కేంద్రంగా డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్ ఏజెన్సీని స్థాపించి విజయం సాధించింది రమ్య. డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్ రంగంలోకి అడుగు పెట్టడం సులువే కానీ, అక్కడ గెలుపు జెండా ఎగరేయడం మాత్రం సులువు కాదు. ఎంతో పోటీ ఉంటుంది. అందుకే ఆషామాషీగా ఏజెన్సి ప్రారంభించలేదు రమ్య. యాక్టివ్ సోషల్‌మీడియా యూజర్ల సంఖ్య ఎంత, ఏ వయసు వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు, వారి స్క్రీన్టైమ్ ఎంత? ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకొని ఏజెన్సీ ప్రారంభించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల గురించి తెలుసుకుంటూ ఉండేది. ‘వీరి ప్రతిభను మనం ఎలా ఉపయోగించుకోగలమా’ అని ఆలోచించేది. ‘ఈ తరం వాళ్లకు ఏది చెప్పినా ఇది మాకు సంబంధించిన విషయమే అన్నట్లుగా చెప్పాలి. ఉన్న వాస్తవాన్ని పదింతలు పెద్దచేసి చూపించే కంటెంట్‌ను వారు ఇష్టపడడం లేదు’ అంటుంది రమ్య. డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్‌కు ఉజ్వల భవిష్యత్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సరికొత్త భవిష్యత్ వ్యూహాలతో సిద్ధం అవుతుంది రమ్య. ‘విజయం అనేది ఒక ప్రాజెక్ట్ కు మాత్రమే పరిమితం. అది పునరావృతం కావాలంటే బుర్రకు ఎప్పుడూ పదును పెడుతూనే ఉండాలి. ఇతరుల కంటే ఎంత భిన్నంగా ఆలోచిస్తున్నామనేదే మన బలం అవుతుంది. మన విజయానికి ఇంధనం అవుతుంది’ అంటున్న రమ్య రామచంద్రన్ మాటలు నిజం కదా. -
మార్కెటింగ్ సంస్కరణలతో రైతులకు లబ్ధి
సాక్షి, అమరావతి: పంటలకు మెరుగైన ధరలు కల్పించడంతో పాటు రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు 2021–22 ఆర్ధిక సంవత్సరం నుంచి ప్రత్యేకంగా గ్రాంట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ గ్రాంట్లు పొందాలంటే 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలను చేయాల్సి ఉంటుందని షరతు విధించింది. ఈ మేరకు మధ్యంతర నివేదికను విడుదల చేసింది. పంటలకు మెరుగైన ధరలు లభించేలా మార్కెటింగ్ వ్యవస్థను సరళీకరించాలని, దళారీ వ్యవస్థను నిర్మూలించాలని, ప్రైవేట్ వ్యాపారుల మధ్య పోటీతత్వం పెంచాలని స్పష్టం చేసింది. 15వ ఆర్థిక సంఘం ఇంకా ఏయే సిఫార్సులు చేసిందంటే... - రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయించుకునేలా మార్కెటింగ్ రంగంలో సంస్కరణలు తీసుకురావాలి. - ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 2016, 2017, 2018లో రూపొందించిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. ఇందుకోసం ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లులను పాస్ చేయాలి. - మార్కెటింగ్ వ్యవస్థలోకి ప్రైవేట్ పెట్టుబడులను తీసుకురావడంతో వ్యవసాయంలో వృద్ధిసాధించొచ్చు. - కేంద్ర మోడల్ చట్టాలకు వీలుగా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభల్లో బిల్లులను ఆమోదిస్తే 2021–22 నుంచి ఆయా రాష్ట్రాలకుగ్రాంట్లు మంజూరు చేస్తాం. విద్య, వైద్య రంగాలకు రాయితీలు అప్పర్ ప్రైమరీ స్కూళ్ల నుంచి సెకండరీ స్కూళ్లకు వచ్చే సరికి చదువుకునే బాలికల సంఖ్య తగ్గిపోతోందని 15వ ఆర్థిక సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. చిన్న వయసులోనే బాలికలు వివాహాలు చేసుకోవడం, గర్భం దాల్చడంతో తల్లీబిడ్డల్లో పౌష్టికాహార లోపాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఈ పరిస్థితిని మార్చడంలో అత్యుత్తమ ఫలితాలు సాధించే రాష్ట్రాలకు 2021–22 నుంచి రాయితీలను సిఫార్సు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి రాష్ట్రాలకు ఇండికేటర్స్‌ను నిర్ధారించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. జాతీయ విద్యా విధానం–2019 ప్రకారం ప్రీ ప్రైమరీ విద్యను అమలు చేసే రాష్ట్రాలకు కూడా రాయితీలను సిఫార్సు చేయనున్నట్లు వెల్లడించింది. - ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని 15వ ఆర్థిక సంఘం పేర్కొంది. ప్రభుత్వ రంగంలోని ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకునే రాష్ట్రాలకు 2021–22 నుంచి గ్రాంట్లు మంజూరు చేస్తామని వివరించింది. - 2021–22లో పోలీసుల శిక్షణ కేంద్రాల ఏర్పాటు, పోలీసుల గృహ నిర్మాణాలకు గాను గ్రాంట్ల మంజూరుకు సిఫార్సులు చేస్తామని, ఈలోగా 2020–21లో పోలీసు శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు స్థలాలను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ పటిష్టానికి నిధులు కేసుల సత్వర పరిష్కారానికి న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తుది నివేదికలో గ్రాంట్లు మంజూరు చేస్తామని 15వ ఆర్థిక సంఘం వెల్లడించింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, లాయర్స్ హాల్స్, సమాచార కేంద్రాలు, జస్టిస్ క్లాక్స్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వివాదాల పరిష్కార కేంద్రాలు, విలేజ్ లీగల్ ఎయిడ్ క్లినిక్స్, జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అధారిటీల సామర్థ్యం పెంపునకు గ్రాంట్లను సిఫార్సు చేస్తామని పేర్కొంది. - వాణిజ్య ఎగుమతులను పెంచే రాష్ట్రాలకు రాయితీలను సిఫార్సు చేయాలని ఆర్థిక సంఘం నిర్ణయించింది. ఈ మేరకు నిర్దిష్ట సూచికలను రూపొందించాలని నీతి ఆయోగ్‌కు సూచించింది. - జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఉత్తమ పనితీరును సాధించిన రాష్ట్రాలకు ఫెర్ఫార్మెన్స్ రాయితీలను ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. ఈ రాయితీలను 2021–22 నుంచి మంజూరు చేయనున్నట్లు పేర్కొంది. -
ఆ కోర్కెలు వెంటాడుతూనే ఉన్నాయి
ఆశించినవన్నీ జరగవు. అయినా కలల్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు. కృషి, పట్టుదల, లక్ష్యసాధనకు దోహదం చేస్తాయి. అలా తన కలల్ని సాకారం చేసుకుంటానంటున్నారు నటి తాప్సీ. ఈ బ్యూటీ తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందారు. ఆడుగళం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ బ్యూటీకి ఇక్కడికంటే టాలీవుడ్లోనే మంచి మార్కెట్ ఉందన్నది నిజం.ఆ మధ్య ఆరంభంలో నటించి మంచి మార్కులే కొట్టేశారు. అయితే నటిగా ఇంత ప్రాచుర్యం పొందిన ఈ బ్యూటీకి నటి అవ్వాలనే కోరిక గాని, అవుతాననే ఆలోచన గానీ మొదట లేవట. బుద్ధిగా చదువుకుని మార్కెటింగ్ రంగంలో రాణించాలని ఆశపడ్డారట. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ చదివిన ఈ అమ్మడికి డిగ్రీ మూడవ ఏట చదువుతున్న సమయంలోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందట. ఆపై తన చదువును కొనసాగించలేకపోయారట. ఒక్కసారి తను చదువుకునే రోజుల్ని తాప్సీ గుర్తు చేసుకుంటూ అప్పట్లో ఎంబీఏ పూర్తి చేయాలని, మార్కెటింగ్ రంగంలో రాణించాలని అన్నది తన డ్రీమ్‌గా ఉండేవని తాప్సీ పేర్కొంది. కంప్యూటర్ సైన్స్ చదివినా, ఇంజినీర్ అవ్వాలనుకోలేదన్నారు. నిజం చెప్పాలంటే అప్పట్లో తనకు వేరే ఆలోచనలు చాలా ఉండేవన్నారు. అలాంటి పరిస్థితుల్లో నటిగా పరిచయమవ్వడం అన్నది ఊహించని విషయమేనన్నారు. అయినా ఇప్పటికీ ఎంబీఏ పూర్తి చేయాలనే కోరిక, మార్కెటింగ్ రంగంలో రాణించాలనే ఆశ తనను వెంటాడుతూనే ఉన్నాయన్నారు. తన డ్రీమ్ అయిన ఆ రెండింటినీ నెరవేర్చుకుంటానని తాప్సీ అంటున్నారు. -
మార్కెటింగ్ రెజ్యూమె రాయడమెలా?
‘వన్ సైజ్ ఫిట్స్ ఆల్’.. మనలో చాలామంది నమ్మే సిద్ధాంత మిది. ఒకటే అన్నింటికీ పనికొస్తుందనుకోవడం పొరపాటు. రెజ్యూమె విషయంలో ఇది ఏమాత్రం వర్తించదు. ఒక్కో రంగాన్ని, ఉద్యోగాన్ని బట్టి రెజ్యూమె కూడా వేర్వేరుగా ఉంటుంది. ఒకదాని కోసం రూపొందించుకున్న రెజ్యూమెను మరో ఉద్యోగం కోసం పంపిస్తే ఫలితం ఉండదు. సాధారణంగా అభ్యర్థులు చేసే తప్పిదం ఏమిటంటే.. ఒక కామన్ ఫార్మాట్లో రెజ్యూమెను తయారు చేసుకొని, దాన్నే అన్ని కంపెనీలకు, అన్ని రకాల ఉద్యోగాలకు పంపిస్తుంటారు. కంపెనీల నుంచి పిలుపు రాక నిరాశ చెందుతుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు రెజ్యూమె ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ఇది అభ్యర్థిపై యాజమాన్యానికి తొలి ప్రభావాన్ని కలిగిస్తుంది. అది సానుకూలమా? ప్రతికూలమా?.. ఎలాంటి ప్రభావమనేది రెజ్యూమెపై ఆధారపడి ఉంటుంది. నచ్చిన కొలువులో ప్రవేశించడానికి ఇది ఒక టికెట్ లాంటిది. ప్రస్తుతం మార్కెటింగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఎలాంటి రెజ్యూమెను రూపొందించుకోవాలో తెలుసుకుందాం.. జాబ్ ఆబ్జెక్టివ్: సంస్థలో ఎలాంటి ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో ఒకటి రెండు వాక్యాల్లో తేలిగ్గా అర్థమయ్యేలా వివరించాలి. దీన్నే జాబ్ ఆబ్జెక్టివ్ అంటారు. రెజ్యూమెకు ఇది స్పాట్లైట్ లాంటిది. నా మార్కెటింగ్ స్కిల్స్‌ను పెంచుకోవడానికి అవసరమైన ఉద్యోగం కావాలి అని రాయకుండా మార్కెటింగ్ రంగంలో నాకు ఒక స్థానాన్ని కల్పించే, సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి నా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు వీలైన పోస్టు కావాలి అంటూ అభ్యర్థించాలి. కంపెనీ నుంచి మీరు ఆశించేదాన్ని కాదు, కంపెనీకి మీరు ఇచ్చేదాన్నే రెజ్యూమెలో ప్రస్తావించాలి. సంస్థలో ఉత్పత్తిని, తద్వారా లాభాలను పెంచడానికి నా అనుభవాన్ని, స్కిల్స్‌ను ఉపయోగించేందుకు పోస్టు కావాలి అని పేర్కొనాలి. మార్కెటింగ్ డెరైక్టర్, ప్రొడక్ట్ మార్కెటింగ్, మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాన్ని కోరుకుంటున్నట్లు నేరుగా తెలియజేయాలి. రెజ్యూమె రైటింగ్‌లో ఇప్పుడు ఇదే ఆధునిక ధోరణి. పోస్టు గురించి ప్రస్తావిస్తే మీలో సీరియస్‌నెస్ ఉందని సంస్థ యాజమాన్యం భావిస్తుంది. పని అనుభవం: మార్కెటింగ్ రెజ్యూమెలో ఉండాల్సిన ప్రధాన అంశం.. పని అనుభవం. గతంలో ఏదైనా సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ మీ హోదా, నిర్వర్తించిన బాధ్యతలను, సాధించిన విజయాలను రెజ్యూమెలో తప్పనిసరిగా రాయాలి. వీలును బట్టి అంకెలు, సంఖ్యలను కూడా ప్రస్తావించాలి. ఇలాంటి రెజ్యూమెకు విలువ అధికంగా ఉంటుంది. చాలా సంస్థలు రెజ్యూమెలను డేటా బేస్‌లో భద్రపరుస్తుంటాయి. మొత్తం రెజ్యూమెను చదవకుండా సెర్చ్‌లో కొన్ని కీ వర్డ్స్‌ను ఉపయోగించి అందులో తమకు అవసరమైన అంశాన్ని చదువుతుం టాయి. ఈ పదాలు సాధారణంగా మార్కెటింగ్‌కు సంబంధించినవే ఉంటాయి. కాబట్టి బిజినెస్ డెవలప్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ కమ్యూని కేషన్, మార్కెట్ రీసెర్చ్, పీఆర్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వంటి పదాలు రెజ్యూమెలో ఉండేలా జాగ్రత్తపడండి. అంతేకాకుండా యాక్సిలరేటెడ్, అడ్మినిస్టర్డ్, కన్వర్టెడ్, ఎక్స్పాండెడ్, జనరేటెడ్, ఇంక్రీజ్డ్, ట్రెయిన్డ్, ఇనిషియేటెడ్ వంటి పదాలను ఉపయోగిస్తూ వాక్యాలను ప్రారంభించండి.