విజయపథం: ఆలోచనే ఆదాయం

Ramya Ramachandran: Digital influencer is the bright future of content marketing - Sakshi

చిన్నప్పుడెప్పుడో స్నేహితురాలికి సినిమా కథ చెప్పింది రమ్య. ఆ స్నేహితురాలు మరుసటిరోజే   సినిమా చూసింది. ‘ఆ సినిమా కంటే నువ్వు చెప్పిన విధానమే బాగుంది’ అని రమ్యకు కితాబు ఇచ్చింది. ప్రతిభ వృథా పోదు అంటారు. రమ్యలోని ప్రతిభ కూడా అంతే. ఒక అంశాన్ని ఆకర్షణీయంగా చెప్పే ఆమె ప్రతిభ మార్కెటింగ్‌ రంగంలో తనకు ఎంతో బలాన్ని ఇచ్చింది.

‘రమ్య రామచంద్రన్‌... యంగ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ మార్కెటింగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’గా గుర్తింపు తెచ్చుకోవడానికి ఉపయోగపడింది.
‘హుపల్‌’ పేరుతో ముంబై కేంద్రంగా డిజిటల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ కంటెంట్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీని స్థాపించి విజయం సాధించింది రమ్య.

డిజిటల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ కంటెంట్‌ మార్కెటింగ్‌ రంగంలోకి అడుగు పెట్టడం సులువే కానీ, అక్కడ గెలుపు జెండా ఎగరేయడం మాత్రం సులువు కాదు. ఎంతో పోటీ ఉంటుంది. అందుకే ఆషామాషీగా ఏజెన్సి ప్రారంభించలేదు రమ్య.

యాక్టివ్‌ సోషల్‌మీడియా యూజర్‌ల సంఖ్య ఎంత, ఏ వయసు వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు, వారి స్క్రీన్‌టైమ్‌ ఎంత? ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకొని ఏజెన్సీ ప్రారంభించింది.  ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌ల గురించి తెలుసుకుంటూ ఉండేది.  ‘వీరి ప్రతిభను మనం ఎలా ఉపయోగించుకోగలమా’ అని ఆలోచించేది.

‘ఈ తరం వాళ్లకు ఏది చెప్పినా ఇది మాకు సంబంధించిన విషయమే అన్నట్లుగా చెప్పాలి. ఉన్న వాస్తవాన్ని పదింతలు పెద్దచేసి చూపించే కంటెంట్‌ను వారు ఇష్టపడడం లేదు’ అంటుంది రమ్య.
డిజిటల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ కంటెంట్‌ మార్కెటింగ్‌కు ఉజ్వల భవిష్యత్‌ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సరికొత్త భవిష్యత్‌ వ్యూహాలతో సిద్ధం అవుతుంది రమ్య.
‘విజయం అనేది ఒక ప్రాజెక్ట్‌ కు మాత్రమే పరిమితం. అది పునరావృతం కావాలంటే బుర్రకు ఎప్పుడూ పదును పెడుతూనే ఉండాలి. ఇతరుల కంటే ఎంత భిన్నంగా ఆలోచిస్తున్నామనేదే మన బలం అవుతుంది. మన విజయానికి ఇంధనం అవుతుంది’ అంటున్న రమ్య రామచంద్రన్‌ మాటలు నిజం కదా.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top