
‘మే’లో 10 నెలల గరిష్టానికి
న్యూఢిల్లీ: దేశీయంగా రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు గత నెలలో భారీగా పెరిగాయి. వెరసి మే నెలలో రోజుకి 1.96 మిలియన్ బ్యారళ్ల(బీపీడీ)ను తాకాయి. ఇది 10 నెలల గరిష్టంకాగా.. ప్రపంచ ప్రామాణిక ధరలకంటే తక్కువలో చమురు లభించడం ఇందుకు సహకరించినట్లు గణాంకాల సంస్థ కెప్లర్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం, దిగుమతులకు మూడో ర్యాంకులో నిలిచే భారత్ విదేశాల నుంచి 5.1 మిలియన్ బ్యారళ్ల చమురును కొనుగోలు చేసింది. ముడిచమురును శుద్ధి చేయడం ద్వారా రిఫైనరీలు పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాల తయారీని చేపట్టే సంగతి తెలిసిందే.
భారత్ కొనుగోలు చేసిన చమురులో రష్యా 38 శాతం వాటా ఆక్రమిస్తోంది. రోజుకి 1.2 మిలియన్ బ్యారళ్ల సరఫరా ద్వారా ఇరాక్ రెండో పెద్ద సరఫరాదారుగా నిలిచింది. ఈ బాటలో భారత్‌కు 6,15,000 బీపీడీ చమురును సౌదీ అరేబియా ఎగుమతి చేయగా.. యూఏఈ 14,90,000 బీపీడీ అందించింది. యూఎస్ నుంచి 2,80,000 బీపీడీ చమురును అందుకుంది. గత నెలలో భారత్ చమురు దిగుమతుల ప్రొఫైల్ ధరల ఆధారంగా విభిన్న ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు కెప్లర్ వివరించింది. నిజానికి మధ్యప్రాచ్యం నుంచి భారత్ అత్యధికంగా చమురును కొనుగోలు చేస్తుంటుంది.