ఎగుమతులు కదల్లేదు..మెదల్లేదు! | India exports in June 2025 held steady | Sakshi
Sakshi News home page

ఎగుమతులు కదల్లేదు..మెదల్లేదు!

Jul 16 2025 10:25 AM | Updated on Jul 16 2025 10:25 AM

India exports in June 2025 held steady

జూన్‌లో ఫ్లాట్‌గా.. 35 బిలియన్‌ డాలర్లు

దిగుమతులు 54 బిలియన్‌ డాలర్లు

సేవల ఎగుమతులు 33 బిలియన్‌ డాలర్లు

నాలుగు నెలల కనిష్టానికి ద్రవ్యలోటు 

వస్తు ఎగుమతులు జూన్‌ నెలలో 35.14 బిలియన్‌ డాలర్లుగా (రూ.2.99 లక్షల కోట్లు) నమోదయ్యాయి. 2024 జూన్‌ నెలలోనూ ఎగుమతులు 35.16 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. దిగుమతులు 3.71 శాతం క్షీణించి 53.93 బిలియన్‌ డాలర్లు (రూ.4.58 లక్షల కోట్లు)గా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు నాలుగు నెలల కనిష్ట స్థాయిలో 18.78 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. పెట్రోలియం ఉత్పత్తులు, వ్రస్తాలు, రత్నాభరణాలు, లెదర్, ముడి ఇనుము, ఆయిల్‌ సీడ్స్, జీడి పప్పు, దినుసులు, పొగాకు, కాఫీ ఎగుమతులు క్రితం ఏడాది జూన్‌ నెలతో పోల్చి చూస్తే క్షీణించాయి. ఇదే కాలంలో ఇంజినీరింగ్, టీ, బియ్యం, రెడీ మేడ్‌ వ్రస్తాలు, కెమికల్స్, సముద్ర ఉత్పత్తులు, ఫార్మా ఎగుమతుల పరంగా సానుకూల వృద్ధి నమోదైంది. జూన్‌ త్రైమాసికంలో వస్తు, సేవల ఎగుమతులు 210 బిలియన్‌ డాలర్లుగా ఉంటాయని.. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం కంటే 6 శాతం ఎక్కువని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ భత్వాల్‌ తెలిపారు.  

ఎగుమతులు–దిగుమతులు  

  • జూన్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 16 శాతం తగ్గి 4.61 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ జుంచి జూన్‌ వరకు మొదటి త్రైమాసికంలో 15 శాతానికి పైగా తగ్గి 17.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

  • ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల ఎగుమతులు జూన్‌లో 47 శాతం పెరిగి 4.14 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలోనూ ఎగుమతులు 47 శాతం వృద్ధితో 12.4 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) వస్తు ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం పెరిగి 112 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దిగుమతులు సైతం 4 శాతానికి పైగా పెరిగి 179 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  

  • ఏప్రిల్‌–జూన్‌ కాలంలో వాణిజ్య లోటు 67 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 62 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి: మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లు  

  • ముడి చమురు దిగుమతులు 8 శాతం తగ్గి 25.73 బిలియన్‌ డాలర్లుగా, బంగారం దిగుతులు 26 శాతం తగ్గి 1.9 బిలియన్‌ డాలర్ల చొప్పున జూన్‌లో నమోదయ్యాయి.  

  • జూన్‌లో సేవల ఎగుమతుల విలువ 32.84 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని వాణిజ్య శాఖ అంచనా వేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 28.67 బిలియన్‌ డాలర్లుగా ఉంది. సేవల దిగుమతుల విలువ 15 బిలియన్‌ డాలర్ల నుంచి 17.58 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement