
జూన్ త్రైమాసికంలో 47 శాతం జంప్
రూ.1.05 లక్షల కోట్లుగా నమోదు
యూఎస్, యూఏఈ, చైనాకు అధికం
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ ఎగుమతులు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్/క్యూ1) బలమైన పనితీరు చూపించాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఏకంగా 47 శాతం పెరిగి 12.41 బిలియన్ డాలర్లకు (రూ.1.05 లక్షల కోట్లు సుమారు) చేరాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. ముఖ్యంగా అమెరికా, యూఏఈ, చైనా టాప్–3 ఎగుమతి గమ్యస్థానాలుగా ఉన్నాయి. నెదర్లాండ్స్, జర్మనీ తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి. ‘‘భౌగోళికంగా వివిధ దేశాల మధ్య ఎగుమతుల్లో వైవిధ్యం, అంతర్జాతీయ ఎల్రక్టానిక్స్ సరఫరా వ్యవస్థతో పెరుగుతున్న భారత్ అనుసంధానతను ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఆసియాలో విశ్వసనీయ ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా భారత్ అవతరిస్తున్నదానికి నిదర్శనం’’అని వాణిజ్య శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
అమెరికాకే 60 శాతం
భారత ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో 60 శాతం మేర అమెరికాకే వెళ్లాయి. ఆ తర్వాత యూఏఈకి 8 శాతం, చైనాకి 3.88 శాతం, నెదర్లాండ్స్‌కు 2.68 శాతం, జర్మనీకి 2.09 శాతం చొప్పున జూన్ త్రైమాసికంలో ఎగుమతులు నమోదయ్యాయి. భారత రెడీమేడ్ వ్రస్తాల ఎగుమతుల్లోనూ (ఆర్‌ఎంజీ) అమెరికాయే అగ్రస్థానంలో ఉంది. 34 శాతం రెడీమేడ్ వస్త్ర ఎగుమతులు అమెరికాకు వెళ్లాయి. ఆ తర్వాత యూకేకి 8.81 శాతం, యూఏఈకి 7.85 శాతం, జర్మనీకి 5.51 శాతం, స్పెయిన్‌కు 5.29 శాతం చొప్పున ఆర్‌ఎంజీ ఎగుమతులు నమోదయ్యాయి. జూన్ త్రైమాసికంలో మొత్తం రెడీమెడ్ వస్త్ర ఎగుమతులు 4.19 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఆరి్థక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇవి 3.85 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జూన్ క్వార్టర్‌లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 19 శాతానికి పైగా పెరిగి 1.95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 37.63 శాతం మేర అమెరికాయే దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత 17 శాతం చైనాకి, 6.63 శాతం వియత్నాంకి, 4.47 శాతం జపాన్‌కు వెళ్లాయి.