బీర్‌ పరిశ్రమలో ఊహించని సమస్య | India Beer Bottleneck Why Can Shortage is Squeezing the Industry | Sakshi
Sakshi News home page

బీర్‌ పరిశ్రమలో ఊహించని సమస్య

Aug 2 2025 12:19 PM | Updated on Aug 2 2025 12:31 PM

India Beer Bottleneck Why Can Shortage is Squeezing the Industry

భారతీయ బీర్ పరిశ్రమ ఊహించని సమస్యలతో సతమతం అవుతుంది. దాదాపు రూ.38,000 కోట్లకు పైగా విలువైన ఈ విభాగం బీర్‌ నింపేందుకు అల్యూమినియం డబ్బాల కొరత ఎదుర్కొంటుంది. బ్రేవరేజ్‌ సంస్థల అంచనాబట్టి సుమారు 12-13 కోట్ల 500 మిల్లీలీటర్ల డబ్బాల వార్షిక లోటు ఉంది. ఇది మొత్తం డిమాండ్‌లో సుమారు 20% ఉండడం గమనార్హం. ఈ కొరత బీర్‌ క్యాన్‌ల లోటును తెలియజేయడంతోపాటు పెరుగుతున్న డిమాండ్, తగినంత దేశీయ మౌలిక సదుపాయాలు లేకపోవడం, ప్రపంచ సరఫరా పరిమితులు, కొత్త నియంత్రణ ఒత్తిళ్లను హైలైట్‌ చేస్తుంది. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకపోతే పరిశ్రమ వృద్ధి మందగించే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

క్యాన్లకు పెరుగుతున్న డిమాండ్

ఒకప్పుడు సీసాల తర్వాత అల్యూమినియం క్యాన్‌లు సెకండరీ ప్యాకేజింగ్ ఎంపికగా ఉండేవి. కానీ పరిస్థితులు మారుతున్న కొద్దీ ఇవే ప్యాకింగ్‌లో ప్రధానంగా నిలుస్తున్నాయి. భారతదేశంలోని అతిపెద్ద బీర్ కంపెనీ అయిన యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్‌(యూబీఎల్‌) క్యాన్ల మొత్తం పరిమాణంలో 22% వాటాను కలిగి ఉంది. ఈ సంఖ్య ఉత్తర ప్రదేశ్ వంటి అధిక వృద్ధి ఉన్న మార్కెట్లలో 75–80% వరకు పెరిగింది. ఆ రాష్ట్రంలోని ఎక్సైజ్ విధాన మార్పులు క్యాన్లను చౌకగా, వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి.

పరిమిత సరఫరా మౌలిక సదుపాయాలు

దేశంలో కేవలం మూడు అల్యూమినియం క్యాన్ల తయారీ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. అందులో రెండింటిని విదేశీ యాజమాన్యంలోని కాన్‌ప్యాక్‌, బాల్ కార్పొరేషన్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. క్యాన్ ఉత్పత్తికి అవసరమైన అల్యూమినియంలో గణనీయమైన భాగం ఇతర దేశాల నుంచే దిగమతి చేసుకుంటున్నారు. ప్రపంచ సరఫరా గొలుసు అంతరాయాల ప్రభావం దీనిపై అధికంగా ఉంది.

సాఫ్ట్‌డ్రింక్స్‌లో..

నాన్ ఆల్కహాలిక్ విభాగంలో క్యాన్లకు డిమాండ్ పెరగడంతో బీర్‌ క్యాన్ల కొరత తీవ్రమవుతోంది. కోకాకోలా, పెప్సికో వంటి శీతల పానీయాల దిగ్గజాలు క్యాన్ ఆధారిత ఉత్పత్తులను వేగంగా పెంచుతున్నాయి.

రెగ్యులేటరీ నిబంధనలు

ఏప్రిల్ 2025లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దిగుమతులతో సహా అన్ని అల్యూమినియం డబ్బాలకు సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. అందులో క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లను (క్యూసీఓ) అమలు చేస్తుంది. నాణ్యత, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నప్పటికీ తక్షణ డిమాండ్‌కు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. బీఐఎస్‌ సర్టిఫికేషన్‌కు విదేశీ తయారీ ప్లాంట్లను ఫిజికల్‌గా తనిఖీ చేయాల్సి ఉంటుంది. అందులో జాప్యం జరుగుతుంది.

ఇండస్ట్రీ ఇబ్బందులు

బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ అమలును ఒక సంవత్సరంపాటు (2026 ఏప్రిల్ వరకు) వాయిదా వేయాలని బ్రేవరీస్‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ప్రభుత్వాన్ని కోరింది. బీఐఎస్ సర్టిఫికేషన్ అవసరాన్ని దేశీయ ఉత్పత్తిదారులకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పింది. దిగుమతులపై ఆంక్షలు విధించకూడదని తెలిపింది. ఇప్పటికే యూబీఎల్‌ విభిన్న మార్కెట్లలో క్యాన్ల కొరత ఉందని తెలిపింది. దాంతో గత ఆరు నెలల్లో 1–2 శాతం నష్టాన్ని అంచనా వేసింది.

ఇదీ చదవండి: యాపిల్‌లో ఇంజినీర్‌ కనీస వేతనం ఎంతంటే..

ఇప్పుడు ఏం చేయాలి?

క్యాన్ల సంక్షోభం మరింత పెరగకుండా నిరోధించడానికి బ్రేవరేజెస్‌, ఇతర సంస్థలు తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశీయ తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలని సూచిస్తున్నారు. కొత్త క్యాన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలంటున్నారు. టెక్నాలజీ, వీటి ఏర్పాటుకు మూలధనం కోసం గ్లోబల్ కంపెనీలతో జాయింట్ వెంచర్లు చేపట్టాలని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement