
గన్నవరం : కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శివారులో ఉన్న ఓ వైన్ షాపులో నకిలీ బీరు కలకలం సృష్టించింది. ఈ షాపులో కొన్న బీరు నకిలీదంటూ కొనుగోలుదారులు సిబ్బందితో గొడవకు దిగారు. దీనికి సంబంధించిన వీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేసరపల్లి ఏలూరు కాలువ సమీపంలో టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో చిల్లీస్ వైన్ షాపు నడుస్తోంది.
ఆదివారం ఈ మద్యం దుకాణంలో ఇద్దరు వ్యక్తులు బీరు బాటిళ్లు కొన్నారు. అందులోని ఒక బాటిల్‌లో బీరుకు బదులుగా నీళ్ల రుచితో ఉన్న ద్రవం ఉందని, ఇది నకిలీ అని వైన్ షాపు సిబ్బందితో గొడవకు దిగారు. తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా నకిలీ మద్యం విక్రయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ సీఐ సురేఖ సోమవారం ఈ వైన్ షాపును తనిఖీ చేశారు.
వివాదానికి కారణమైన బీరు కేసులను పరిశీలించి, అవి నకిలీవి కాదని తెలిపారు. ఇదిలా ఉండగా, నకిలీ బీరు విక్రయించారనే గొడవ ఆదివారం చోటుచేసుకోగా, సోమవారం ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసి.. బీర్లు నకిలీవి కాదని చెప్పడం పట్ల స్థానికులు విస్తుపోతున్నారు. బీరు కేసులను మార్చిఉండరనే గ్యారంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.