
త్వరలో ఢిల్లీ సర్కార్ కొత్త మద్యం పాలసీ
25 ఏళ్ల నిబంధనను సడలించాలని నిర్ణయం
ఆదాయం కోసం ప్రైవేట్ షాపులకు అనుమతులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇకపై 21 సంవత్సరాలున్న యువత బీరు తాగేందుకు అర్హులవుతారు. ఆబ్కారీ చట్టం ప్రకారం ఢిల్లీ మినహా దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 25 ఏళ్లున్న వారికి మాత్రమే బీరు తాగేందుకు అనుమమతి ఉంది. తాజాగా ఈ రూల్‌ను మార్చి కొత్త మద్యం విధానాన్ని తెచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
21 ఏళ్ల వయస్సు వారిని బీరు తాగేందుకు అనుతించడం వల్ల వీరంతా శివారులోని గురుగ్రామ్, నోయిడా, ఘాజియాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి అక్రమంగా మద్యం తాగడాన్ని నిరోధించవచ్చని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం సంబంధిత వర్గాలు నిపుణులతో చర్చలు జరుపుతోంది. నాలుగైదు నెలల్లో కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది.
కొత్త విధానం ఎలా ఉండొచ్చు..?
ప్రస్తుతం ఉన్న మద్యం విధానం ప్రకారం ప్రభుత్వ ఆదాయం ఏడాదికి రూ.12 వేల కోట్ల నుంచి రూ.13వేల కోట్ల వరకు ఉండాలి. కానీ, రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లు మాత్రమే వస్తోంది. కొత్త విధానం ద్వారా ఆదాయాన్ని బాగా పెంచుకోవడమే ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేటు మద్యం దుకాణాలను కూడా తెరవాలని యోచిస్తోంది. బ్రాండెడ్ మద్యం కొరతను నివారించడంపైనా దృష్టి సారించింది.
బ్రాండెడ్ మద్యం కొరత కారణంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్)లో జరుగుతున్న రూ.5 వేల కోట్ల నుంచి రూ.7000 కోట్ల లావాదేవీలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఈ ఆదాయం ప్రధానంగా శివారులోని గురుగ్రామ్, నోయిడా, గాజియాబాద్ వంటి ప్రాంతాలకు వెళుతోంది. నివాస ప్రాంతాలు మినహా షాపింగ్ మాల్స్ తదితర వ్యాపార సముదాయాల్లో మద్యం షాపులను తెరవనున్నారు.
కొత్త మద్యం పాలసీ పూర్తిగా ప్రభుత్వం, లేదా ప్రభుత్వం–ప్రైవేట్, లేదా పూర్తిస్థాయి ప్రైవేట్ అనే మూడు మోడళ్లపై చర్చిస్తోంది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిచ్చి విమర్శల పాలైంది. ఆ తర్వాత వాటిని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త లిక్కర్ పాలసీపై పూరి్థస్థాయి చర్చల తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.