త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా భారత్‌

India to become 5 trillion dollers economy early in Amrit Kaal - Sakshi

ఆర్థిక వ్యవస్థపై కేంద్రం భరోసా

లోక్‌సభలో మంత్రి పంకజ్‌ చౌదరి ప్రకటన

న్యూఢిల్లీ: భారత్‌ 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారే క్రమం (అమృత్‌ కాల్‌) తొలి దశలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించనున్నట్లు  ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. భారతదేశం 2027–28లో ఐదు ట్రిలియన్‌ ఎకానమీతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ అంచనా వేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వం, దీనివల్ల ఏర్పడే బలమైన రూపాయి సహాయంతో భారత్‌ ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ మైలురాయిని దాటుతుందని లోక్‌సభలో ఇచి్చన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా అమృత్‌ కాల్‌ ప్రారంభ సమయంలోనే దేశం  5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది‘ అని చౌదరి చెప్పారు.  

పురోగతి ఇలా...
మంత్రి పేర్కొన్న సమాచారం ప్రకారం, 1980–81లో భారత్‌ ఎకానమీ పరిమాణం 189 బిలియన్‌ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్‌ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్‌ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారింది.

2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్‌ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్‌ డాలర్లు) కొనసాగుతున్న భారత్‌ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా.  2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్‌ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది.

ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్‌ (4.2 ట్రిలియన్‌ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్‌ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్‌ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు  ఉన్నాయి. 

ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.

భారత్‌ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్‌ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్‌  విజన్‌ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తోంది.  ఈ విజన్‌ డాక్యుమెంట్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. విజన్‌ డాక్యుమెంట్‌– 2047 భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశించనుంది.   దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి  విజన్‌ 2047  ప్రధానంగా నిర్దేశించుకుంది.
 
మంత్రి ఇంకా ఏమన్నారంటే..

► భారతదేశం మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థ.  మార్కెట్‌ నిర్ణయించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), మారకపు రేటు ద్వారా ప్రభుత్వం ఆర్థిక పురోగతిని పర్యవేక్షిస్తుంది.
►దేశీయ–అంతర్జాతీయ మార్కెట్లు రెండూ భారతదేశ జీడీపీ మారకపు రేటు, జీడీపీకి సంబంధించి వివిధ రంగాల సహకారాన్ని నిర్ణయించే యంత్రాంగాలు.  
►2022–23లో భారత్‌ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం.  
►వార్షిక బడ్జెట్‌లలో ప్రకటించిన చర్యలతో సహా విధానపరమైన నిర్ణయాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది.  
►జీడీపీ వృద్ధి రేటును వేగంగా పెంచడం కోసం ప్రభుత్వం గత 9 ఏళ్లలో తీసుకున్న ప్రధాన కార్యక్రమాలలో... దివాలా (ఐబీసీ) కోడ్‌ అమలు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు తగిన మూలధన కల్పన,  వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు,  కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, మూలధన వ్యయాల్లో నాణ్యత పెంపు, 14 రంగాలలో ఉత్పత్తి ఆధారిత పథకాల పథకం అమలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విధానాల్లో నిరంతర సరళీకరణ, డిజిటల్‌ మౌలిక సదుపాయాల కల్పన ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top