
సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1.76 కోట్ల ఈక్విటీ షేర్లను యూకే ప్రమోటర్ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ విక్రయానికి ఉంచనుంది. కొత్తగా ఈక్విటీ జారీ లేకపోవడంతో ఐపీవో నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి.
ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ అనుబంధ సంస్థ ఇది. ఈ భాగస్వామ్య సంస్థలో ఐసీఐసీఐ బ్యాంక్ వాటా 51 శాతంకాగా.. ప్రుడెన్షియల్ కార్పొరేషన్‌కు 49 శాతం వాటా ఉంది. కాగా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీలో 2 శాతం అదనపు వాటా కొనుగోలుకి బోర్డు అనుమతించినట్లు మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. తద్వారా సంస్థలో మెజారిటీ వాటాను నిలుపుకోనున్నట్లు తెలియజేసింది. ఐపీవో ద్వారా దేశీయంగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఐదో అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిలవనుంది.
బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 0.7 శాతం నష్టంతో రూ. 1432 వద్ద ముగిసింది.