ఇన్సూరెన్స్‌తోపాటు ఈక్విటీ.. కొత్త మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇవే.. | New Fund Offers from Tata AIA Trust MF ICICI Prudential | Sakshi
Sakshi News home page

ఇన్సూరెన్స్‌తోపాటు ఈక్విటీ.. కొత్త మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇవే..

Mar 2 2026 4:42 PM | Updated on Mar 2 2026 4:52 PM

New Fund Offers from Tata AIA Trust MF ICICI Prudential

అంతర్జాతీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే అవకాశాన్ని కల్పించే దిశగా టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ  ‘టాటా ఏఐఏ గ్లోబల్‌ ఈక్విటీ ఫండ్‌’ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ మార్చి 5 వరకు అందుబాటులో ఉంటుంది. జీవిత బీమా రక్షణ కల్పించడంతో పాటు గ్లోబల్‌ ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధికి కూడా దోహదపడేలా ఇది ఉంటుంది. టాటా ఏఐఏ శుభ్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌ లాంటి యూనిట్‌ లింక్డ్‌ పథకాల ద్వారా ఈ ఫండ్‌ అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఫండ్‌ నిధుల్లో 70%–100% వరకు భాగాన్ని గ్లోబల్‌ ఈక్విటీల్లో, మిగతా భాగాన్ని డెట్, మనీ మార్కెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు.

ట్రస్ట్‌ ఎంఎఫ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ 
ప్రధానంగా మిడ్‌–క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ట్రస్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ని ఆవిష్కరించింది. ఇది మార్చి 13 వరకు అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌పరంగా 101 నుంచి 250 ర్యాంకుల వరకు ఉండే సంస్థల షేర్లు, ఈక్విటీ సంబంధ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీనికి నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 టీఆర్‌ఐ ప్రామాణికంగా ఉంటుంది. దేశీయంగా తయారీ, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన పలు మిడ్‌ క్యాప్‌ కంపెనీలు గణనీయంగా రాణిస్తున్నాయని సంస్థ తెలిపింది. గత అయిదేళ్లలో ఈ విభాగంలోని 37 కంపెనీలు మూడు రెట్లు రాబడులు అందించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిడ్‌–క్యాప్‌ కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఫండ్‌ ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో సందీప్‌ బాగ్లా తెలిపారు.  

ఐసీఐసీఐ ప్రు లైఫ్‌ డివిడెండ్‌ లీడర్స్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌ 
యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌ (యులిప్‌) కింద ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా డివిడెండ్‌ లీడర్స్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. నిలకడగా డివిడెండ్లను చెల్లించే ట్రాక్‌ రికార్డుతో ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. బీఎస్‌ఈ 500 నుంచి ఎంపిక చేసిన 50 కంపెనీల ఇండెక్స్‌ని ఇది ట్రాక్‌ చేస్తుంది. ఐసీఐసీఐ ప్రు సిగ్నేచర్‌ అష్యూర్, స్మార్ట్‌కిడ్‌ అష్యూర్, స్మార్ట్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ప్లస్‌ (సిప్‌ ప్లస్‌) తదితర పథకాలతో ఇది లభిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement