
దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆఫీస్ మార్కెట్లలో నగరం అగ్రగామిగా నిలిచిందని, ఈ ఏడాది తొలి అర్ధభాగం నగర ఆఫీస్ మార్కెట్ అనూహ్యమైన డిమాండ్‌ను చవిచూసిందని ‘ఎ బిలియన్ స్క్వేర్ ఫీట్ అండ్ కౌంటింగ్ – ఇండియా ఆఫీస్ సప్లై’ నివేదికలో నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ తెలిపింది. ఈ నివేదిక వెల్లడించిన ఇతర విశేషాల ప్రకారం.. –సాక్షి, సిటీబ్యూరో
ఈ ఏడాది మొదటి అర్ధభాగం పూర్తయ్యే నాటికి, నగరం మొత్తం ఆఫీస్ స్టాక్ 123 మిలియన్ చదరపు అడుగులు, ఇది భారతదేశపు మొత్తం ఆఫీస్ మార్కెట్‌లో 12% కాగా వార్షికంగా చూస్తే 9.2% అభివృద్ధితో టాప్ ఆరు మెట్రో నగరాల్లోనే అత్యధిక వృద్ధిని ప్రదర్శించింది. టెక్ రంగంలో బలమైన ప్రగతి, నిరంతరం కొనసాగుతున్న మౌలిక సదుపాయాల మెరుగుదల, వాణిజ్య కార్యకలాపాలకు అనువైన వాతావరణం నగర కార్యాలయ విస్తృతికి దోహదం చేస్తున్నాయి.
టాప్ ప్లేస్‌లో ఈ ఏరియాలు..
కొండాపూర్, మణికొండతో సహా సెకండరీ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లు(ఎస్‌బీడీలు) నగర వాణిజ్య కార్యాలయ ల్యాండ్‌స్కేప్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇవే మొత్తం కార్యాలయ సముదాయంలో 47% వాటా కలిగి ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో గచ్చిబౌలి, కోకాపేట, నానక్‌రామ్‌గూడ వంటివి 41% వాటాను దక్కించుకున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంప్రదాయ సెంటర్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లు ఇప్పుడు 11% వాటాను కలిగి ఉన్నాయి. మెట్రో కనెక్టివిటీ వంటి బలమైన మౌలిక సదుపాయాలు తక్కువ కార్యాచరణ ఖర్చులు వంటివి ఈ వృద్ధికి ఆజ్యం పోస్తున్నాయి.
ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..
నాణ్యతలో టాప్ 3..
గ్రేడ్ ఏగా లెక్కించిన 68% కార్యాలయ సముదాయంతో నగరంలోని ఆఫీస్ స్పేస్ నాణ్యతపరంగా మొదటి మూడు భారతీయ నగరాల్లో ఒకటిగా ఉంది. నగరంలో గ్రేడ్ బీ 30% వాటాను కలిగి ఉండగా, గ్రేడ్ సీ కేవలం 1% మాత్రమే ఉండటం గమనార్హం. నగరం కొంత కాలంగా ఐటీ/ఐటీఇఎస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీలు), ఫార్మా లైఫ్ సైన్సెస్ సంస్థలకు ఆకర్షణీయంగా, అయస్కాంతంలా మారింది. ఇవే ప్రధానంగా లీజింగ్ కార్యకలాపాలకు ఊపునిస్తున్నాయి. ఈ ఏడాది అర్ధభాగంలో, నగరంలోని కీలక టెక్ కారిడార్లలో ఫ్లెక్స్–ఎనేబుల్డ్ వర్క్‌స్పేస్‌లను కోరుకునే బహుళజాతి సంస్థల నుంచి సిటీ బలమైన డిమాండ్‌ను చవి చూసింది.