హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి బుల్లెట్ వేగంతో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు తుది రూపానికి వచ్చాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ముంబై-పుణె-హైదరాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) అధికారికంగా ఖరారైంది. భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుల్లో ఇది కీలకంగా నిలవనుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని, అలాగే హైదరాబాద్‌ను ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించే మరో మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల ఏర్పాట్లను కూడా సమగ్రంగా సమీక్షించారు.
12 గంటల ప్రయాణం.. ఇక 3 గంటల్లోనే..
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవడానికి సాధారణ రైళ్లు లేదా రోడ్డు మార్గం ద్వారా దాదాపు 12 నుంచి 15 గంటల సమయం పడుతోంది. అయితే, ఈ ప్రతిపాదిత బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గిపోనుంది. కేవలం 3 గంటల్లోనే ప్రయాణీకులు తమ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.
ప్రాజెక్టు పేరు: ముంబై-పుణె-హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్
ప్రాజెక్ట్ అమలు చేసే సంస్థ: నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్)
మొత్తం దూరం: 671 కిలోమీటర్లు
గరిష్ట వేగం: గంటకు 320 కిలోమీటర్లు
టెర్మినల్ నగరాలు: నవీ ముంబై-హైదరాబాద్
మూడు రాష్ట్రాల మీదుగా 10 స్టేషన్లు
ఈ హై-స్పీడ్ రైలు కారిడార్ మొత్తం మూడు ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ గుండా ప్రయాణిస్తుంది. పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక, ఐటీ, ఆధ్యాత్మిక పట్టణ కేంద్రాలను అనుసంధానిస్తూ మొత్తం 10 స్టేషన్లను ఈ మార్గంలో ప్రతిపాదించారు.
స్టేషన్ల వారీగా రూట్ మ్యాప్..
1. నవీ ముంబై
2. లోనావాలా
3. పింప్రి-చించ్వాడ్
4. పుణె (లోని)
5. బారామతి
6. పంఢరపూర్
7. సోలాపూర్
8. కలబురగి
9. వికారాబాద్
10. హైదరాబాద్
ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు - ప్రయోజనాలు
ఈ మెగా ప్రాజెక్టు ప్రయాణ సమయాన్ని తగ్గించడంతోపాటు మూడు రాష్ట్రాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయనుంది. ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ పెరగడం వల్ల పెట్టుబడులు వరదలా రానున్నాయి. గంటకు 320 కి.మీ వేగంతో నడిచే ఈ రైళ్లు రవాణా రంగంలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తాయి. మహారాష్ట్రలోని పారిశ్రామిక ప్రాంతాలు, కర్ణాటకలోని వెనుకబడిన ప్రాంతాలు, తెలంగాణలోని ఐటీ-ఫార్మా హబ్‌లకు ఈ కారిడార్ ఊతం ఇవ్వనుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించి స్థిరమైన, పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను భవిష్యత్తు తరాలకు అందించడమే దీని లక్ష్యం. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ దశల్లో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.
ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!


