2038 కల్లా బుల్లెట్ రైల్ కల సాకారం
ప్రతిపాదిత బుల్లెట్ రైళ్ల కారిడార్ల పూర్తికి కనీసం 12 ఏళ్లు పట్టే అవకాశం
భూసేకరణకు కనీసం 4–5 ఏళ్లు, నిర్మాణానికి 8 ఏళ్లు కావాల్సిందే
దేశ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు అయిన అహ్మదాబాద్–ముంబై కారిడార్ అనుభవం చెబుతున్నది ఇదే
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి బుల్లెట్ రైలు మరో రెండేళ్లలో ముంబై–అహ్మదాబాద్ కారిడార్‌పై పరుగులు తీయనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మరో ఏడు కారిడార్లలో మూడు కారిడార్లు హైదరాబాద్‌తో అనుసంధానం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాటిలో ముంబై (పుణే తొలిదశ) కారిడార్ డీపీఆర్ తాజాగా సిద్ధమవగా మిగతా రెండు కారిడార్ల డీపీఆర్‌లు కూడా ఈ ఏడాదే పూర్తి కానున్నాయి. దీంతో ఈ నాలుగు నగరాల మధ్య విమానయానానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుందన్న సంబురం అందరిలో కనిపిస్తోంది. కానీ బుల్లెట్ రైలు ఎక్కి ఆ సంబరాన్ని అనుభవించాలంటే మాత్రం కనీసం 2038 వరకు ఎదురుచూడాల్సి రానుంది!
అహ్మదాబాద్–ముంబై ప్రాజెక్టు అనుభవాలు ఇవే...
దేశానికి తొలి బుల్లెట్ రైలును పరిచయం చేయబోతున్న అహ్మదాబాద్–ముంబై (508 కి.మీ) కారిడార్ పనులు 2017లో ప్రారంభమయ్యాయి. బుల్లెట్ వేగంతో పనులు పూర్తి చేసి ఆరేడేళ్లలో రైలును పట్టాలెక్కించాలని భావించారు. కానీ భూసేకరణకే ఆరేళ్ల కాలం కరిగిపోయింది. మధ్యలో కోవిడ్ కష్టకాలం కూడా జాప్యాన్ని పెంచింది. అయితే ఎట్టకేలకు వచ్చే ఏడాది సూరత్ సెక్షన్‌లో 100 కి.మీ. నిడివిలో బుల్లెట్ రైలు పరుగుపెట్టనుంది. కానీ మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి 2029 వరకు సమయం పట్టనుంది. ఈ కారిడార్‌తో పోలిస్తే హైదరాబాద్‌తో అనుసంధానమయ్యే మూడు రూట్ల నిడివి ఎక్కువే. దీంతో పనులు పూర్తయ్యేందుకు 15 ఏళ్ల సమయం పట్టొచ్చని హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ అంచనా వేస్తోంది. అయితే కనీసం ఒక ప్రాజెక్టునైనా వేగంగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది.
ఎక్కువ సమయం దేనికంటే?
బుల్లెట్ రైలు కారిడార్ స్టాండర్డ్ గేజ్‌లో ఉంటుంది. ఎలివేటెడ్ వయాడక్ట్‌తో కలుపుకొని దీని వెడల్పు 17.5 మీటర్ల వెడల్పు. అంటే ఒక కి.మీ. కారిడార్ నిర్మాణానికి 1.75 హెక్టార్ల భూమి అవసరం. స్టేషన్ భవనాలు, డిపోలు, సొరంగాల నిర్మాణం లాంటివి కలుపుకొంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్–పుణే–ముంబై కారిడార్ కోసం 2 వేల హెక్టార్లు అవసరమవుతుందని అంచనా. ఇందులో తెలంగాణ పరిధిలో 280 హెక్టార్లు అవసరమవుతుంది. బెంగళూరు కారిడార్ కోసం 1,850 హెక్టార్లు, చెన్నై కారిడార్ కోసం 2,330 హెక్టార్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఇందులో 80 శాతం భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉండటంతో పరిహారంపై నిర్వాసితుల అభ్యంతరాలు, కోర్టు కేసులు పరిష్కారమై కార్పొరేషన్ చేతికి భూమి లభించేందుకు కనీసం 4–5 ఏళ్ల సమయం పడుతుందని హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ భావిస్తోంది.
ఎలివేటెడ్ నిర్మాణాలు కావడంతో..
బుల్లెట్ రైలు కారిడార్లు ఎలివేటెడ్ పద్ధతిలో రూపొందుతాయి. ఎలివేటెడ్ వయాడక్డ్ ఎత్తు 10 మీటర్ల నుంచి 15 మీటర్ల మేర ఉంటుంది. అహ్మదాబాద్ ప్రాజెక్టులో సబర్మతి నదిని క్రాస్ చేసే చోట దాని ఎత్తు గరిష్టంగా 35 మీటర్లుగా ఉంది. అంటే ఫ్లైఓవర్ నిర్మించిన తరహాలో ఉంటుంది. అందుకే వాటి నిర్మాణానికి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే బుల్లెట్ రైళ్ల గరిష్ట వేగం 400 కి.మీ.. ఆపరేషనల్ వేగం గంటకు 320–350 కి.మీ.గా ఉండనుంది. అంత వేగంతో సాఫీగా రైళ్లు ప్రయాణించాలంటే కారిడార్‌లో మలుపులు తక్కువగా ఉండాలి. ఎదురుగా నది, గుట్ట అడ్డొస్తే తప్పించే వీలుండదు. అందుకే కారిడార్ మార్గంలో సొరంగాల నిర్మాణం నిడివి కూడా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్–ముంబై కారిడార్‌లో వికారాబాద్ సమీపంలో ఏకబిగిన 4.5 కి.మీ. సొరంగ మార్గం ఉండనుంది. అలాగే పుణే దాటాక వచ్చే పశ్చిమ కనుమల ఖండాలా ఘాట్ ప్రాంతంలో అత్యంత సంక్లిష్టమైన 13 సొరంగాలు (మొత్తం 24 కి.మీ. నిడివి) నిర్మించాల్సి రానుంది. ముంబై పరిసరాల్లో సుమారు 35 కి.మీ. మేర భూగర్భ ట్రాక్ ఉండనుంది. బెంగళూరు శివార్లలోనూ వాటి అసవరం ఏర్పడనుంది. తమిళనాడు సరిహద్దుల్లో (మింజూర్ పరిసరాల్లో) సుమారు 11.6 కి.మీ పొడవైన సొరంగం, ఏపీలోని కొన్ని కొండ ప్రాంతాల్లో సొరంగాలు నిర్మించాల్సి రానుంది.
నిడివి–అంచనా వ్యయం
హైస్పీడ్ రైలు మార్గాల నిర్మాణానికి ఒక్కో కిలోమీటర్ ట్రాక్‌కు దాదాపు రూ. 250 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు ఖర్చవుతుందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర్కొంటోంది. ఈ లెక్కన మూడు కారిడార్ల అంచనాలు ఇలా ఉన్నాయి.
1) హైదరాబాద్–పుణె–ముంబై కారిడార్
మొత్తం నిడివి: సుమారు 671 కి.మీ.
నిర్మాణ వ్యయం (అంచనా): సుమారు రూ. 1.60 లక్షల కోట్ల నుంచి రూ. 1.80 లక్షల కోట్ల వరకు.
ఈ మార్గంలో పశి్చమ కనుమల (ఘాట్ రోడ్లు) గుండా సొరంగాలు నిర్మించాల్సి రావడం వల్ల మిగిలిన రూట్లతో పోలిస్తే కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది.
2) హైదరాబాద్–బెంగళూరు కారిడార్
మొత్తం నిడివి: దాదాపు 618 కి.మీ.
నిర్మాణ వ్యయం (అంచనా): రూ. 1.50 లక్షల కోట్ల నుంచి రూ. 1.65 లక్షల కోట్లు వరకు
3) హైదరాబాద్–విజయవాడ–చెన్నై కారిడార్
మొత్తం నిడివి: దాదాపు 744 కి.మీ.
నిర్మాణ వ్యయం (అంచనా): దాదాపు రూ. 1.85 లక్షల కోట్ల నుంచి రూ. 2.10 లక్షల కోట్ల వరకు
ముంబై–అహ్మదాబాద్ ప్రాజెక్టుకు 2016లో అంచనా వ్యయం రూ. 1.09 లక్షల కోట్లుకాగా ప్రస్తుతం దాన్ని రూ. 1.85 లక్షల కోట్లకు సవరించారు. ఈ లెక్కన మన మూడు ప్రాజెక్టులు మరో 10–15 ఏళ్లతో కూడుకున్నవి కావడంతో ఖర్చు భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.


