
బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, అయేషా ష్రాఫ్ దంపతులు 15 సంవత్సరాల్లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఏకంగా రూ.100 కోట్ల కార్పస్‌ను క్రియేట్ చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. పెట్టుబడి పెట్టేందుకు చాలామందే ఆసక్తి చూపిస్తారు. కానీ సరైన టైమింగ్, ఇన్వెస్ట్ చేసే వ్యాపారంపై నమ్మకం, స్ట్రాటజీ ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని వీరు నిరూపించారు. వ్యాపార చతురతతో జాకీష్రాఫ్ గతంలో తీసుకున్న ఒక్క నిర్ణయంతో పెద్ద మొత్తంలో కార్పస్ జనరేట్ అయింది. అసలు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు.. ఎలా అంతమొత్తంలో సంపద సృష్టించారో తెలుసుకుందాం.
1995లో భారత్ తీసుకున్న ఆర్థిక సరళీకృత నిర్ణయాలవల్ల చాలా అంతర్జాతీయ కంపెనీలు దేశంలోకి ప్రవేశించాయి. అందులో భాగంగా సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా తన టీవీ ఛానెల్‌ను భారతదేశంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో జాకీష్రాఫ్, అయేషా ష్రాఫ్‌తో కలిసి ఏడుగురు సభ్యుల బృందంతో కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు వ్యూహాత్మక భాగస్వాములుగా మారారు. కొత్త కంపెనీ కదా ఇందులో పెట్టుబడి పెడితే రాబడి ఎలా ఉంటుందోననే అనుమానాలకు తావు లేకుండా తాము నమ్మిన వ్యాపారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ సమయంలో టెలివిజన్ బిజినెస్‌కు ప్రజలు ఆసక్తి చూపుతారనే స్ట్రాటజీతో ముందుకెళ్లారు. క్రమంగా కంపెనీ ఎదిగి తాము అప్పట్లో ఇన్వెస్ట్ చేసిన రూ.1లక్ష 15 ఏళ్ల తర్వాత రూ.100 కోట్లు అయినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
ఇదీ చదవండి: పాలసీ ఏజెంట్లు చెప్పని విషయాలు
ఎందులో పెట్టుబడి పెట్టినా సరైన టైమింగ్, ఇన్వెస్ట్ చేసే వ్యాపారంపై నమ్మకం, స్ట్రాటజీ ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని గమనించాలి.