
ఒక వ్యక్తి ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో ఆరోగ్య బీమా కీలకం. ముఖ్యంగా భారతదేశం వంటి వైద్య ఖర్చులు అధికంగా ఉన్న దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రధానపాత్ర పోషిస్తోంది. అయితే పాలసీలను విక్రయించే రేసులో చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. కొందరు అనుసరిస్తున్న మోసపూరిత ఎత్తుగడలు ఆరోగ్య బీమా పాలసీలపై అవగాహన పెంపొందించడాన్ని హైలైట్ చేస్తున్నాయి. ఏజెంట్లు వినియోగదారులను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో.. పాలసీల్లో ఉన్న రహస్యాలను చెప్పకుండా ఎలా దాచే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకుందాం.
మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్
చాలా మంది బీమా ఏజెంట్లు పాలసీదారులకు మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్ ఎంతనే విషయాలను హైలైట్ చేయరు. వాటి గురించి చెబితే పాలసీ తీసుకోరేమోననే భయాలుంటాయి. కాబట్టి పెద్దగా వీటి గురించి మాట్లాడరు. ఇవి పాలసీదారుడి కవరేజీని అర్థం చేసుకోవడానికి కీలకం. మినహాయింపుల్లో ప్రీహెల్త్ కండిషన్, నిర్దిష్ట చికిత్సలు, పాలసీని కొనుగోలు చేసిన వెంటనే చేయించాలనుకునే వ్యాధుల వివరాలు ఉంటాయి. వీటి గురించి ఏజెంట్లు చెప్పకపోయినా పాలసీదారులే తెలుసుకోవాలి. కొన్ని షరతుల కోసం (ప్రసూతి కవరేజీ లేదా నిర్దిష్ట శస్త్రచికిత్సలు వంటివి) వెయిటింగ్ పీరియడ్ 1 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటాయి. ఏయే పాలసీలో ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉందో తీసుకునేముందు తెలుసుకోవాలి.
గది అద్దె పరిమితులు
చాలా బీమా పాలసీలు గది అద్దెపై పరిమితులను విధిస్తాయి. ఇది ఆసుపత్రిలో చేరిన సందర్భంలో కవరేజీని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, ఆసుపత్రిలో చేరిన తర్వాత ఒక పాలసీ సాధారణ వార్డులో చేరడాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. కొన్ని గది అద్దెలో రోజుకు కొంత నిర్దిష్ట మొత్తాన్నే మాత్రమే చెల్లిస్తాయి. బీమా చేసిన వ్యక్తి చికిత్సకు వైద్యపరంగా ఇతర గది అవసరమైనప్పటికీ సదరు మొత్తాన్ని చెల్లించవు. ఈ వివరాలను ఏజెంట్లు చెప్పకపోవచ్చు.
జీవితకాల కవరేజీ..
చాలా మంది ఏజెంట్లు పాలసీలను ఎలాగోలా కట్టబెట్టాలనే ఉద్దేశంతో ‘ఏదైనా ఆసుపత్రిలో నగదు రహిత చికిత్స’ లేదా ‘జీవితకాల కవరేజీ’ అని ప్రచారం చేస్తారు. అయితే నగదు రహిత చికిత్స సౌకర్యాలు పాలసీ ఆసుపత్రుల నెట్‌వర్క్‌కు పరిమితం అవుతాయి. పాలసీదారులు ఇతర ఆసుపత్రిని ఎంచుకుంటే ముందుగా డబ్బు చెల్లించి తర్వాత క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. కొందరు ఏజెంట్లు జీవితకాల కవరేజీ గురించి ప్రచారం చేస్తున్నప్పటికీ వృద్ధులకు వయసు పరిమితులు లేదా మినహాయింపులు ఉంటాయి.
ఇప్పుడేం చేయాలంటే..
తప్పుదోవ పట్టించే ఆరోగ్య బీమా పాలసీల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పాలసీ తీసుకోవడానికి ముందు ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరం.
ఏజెంటు చూపించే బ్రోచర్ మాత్రమే కాకుండా పాలసీలోని అంతర్గతంగా దాగి ఉన్న అంశాలను తెలుసుకోవాలి. వాటి గురించి ప్రత్యేకంగా ఏజెంట్లును, నిపుణులను అడిగి తెలుసుకోవాలి. పాలసీ అధికారిక వెబ్‌సైట్‌ల్లో పూర్తి వివరాలు ఉంటాయి.
ఐఆర్డీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో అన్ని పాలసీ సంస్థలు వివరాలు ఉంటాయి. ఏటా క్లెయిమ్ పర్సంటేజ్‌కు సంబంధించిన విషయాలు ఉంటాయి.
క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని తనిఖీ చేయడానికి, వివిధ పాలసీ ప్లాన్లను పోల్చడానికి ఐఆర్డీఏఐ సాధనాలను అందిస్తుంది.
ఏజెంట్ ఏదైనా వాగ్దానాలు లేదా మౌఖిక హామీలు (ప్రతిచోటా నగదు రహితం, జీవితకాల కవరేజీ వంటివి) ఇస్తే వాటిని పాలసీ డాక్యుమెంటేషన్‌లో చూపించమని డిమాండ్ చేయాలి.
నిజంగా అవి డాక్యుమెంట్లో ఉంటే క్లెయిమ్ దాఖలు చేసేటప్పుడు వ్యత్యాసాల సమయంలో ఇది సాక్ష్యంగా ఉపయోగపడుతాయి.
ఆరోగ్య బీమా పాలసీలు వివిధ అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి. ఒక వ్యక్తికి మెరుగ్గా పనిచేసే పాలసీ మరొకరికి తగినది కాకపోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏవరి ప్రత్యేక అవసరాలు వారికి ఉంటాయని గమనించాలి. ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తప్పకుండా తీసుకోవాలి.
ఇదీ చదవండి: పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?