
కొందరికి అప్పు అంటే మహా చెడ్డ భయం. దాని జోలికి కూడా వెళ్లరు. మీరు తీసుకోరు సరే.. మరి ఎవరైనా మీ పేరుతో అదేనండి మీకు తెలియకుండా మీ పాన్ కార్డు వివరాలతో లోన్ తీసుకుని ఉంటే.. అమ్మో ఇది ఫ్రాడ్. అవును ఫ్రాడే మరి. డౌట్గా ఉందా? మీ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారేమో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎలాగో ఈ కథనంలో చదివేయండి వెంటనే..
రుణ మోసాలు, సున్నితమైన, ఆర్థికపరమైన డాక్యుమెంట్ల దుర్విగియోగం వంటివి ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మీ కార్డులేమైనా దుర్వినియోగానికి గురయ్యాయా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ పాన్ కార్డు మీ క్రెడిట్ రిపోర్ట్ తో లింక్ అయి ఉంటుంది. దానిని ఉపయోగించి తీసుకున్న ఏదైనా రుణం (మీ సమ్మతితో లేదా సమ్మతి లేకుండా) మీ క్రెడిట్ రేటింగ్, మీ రుణ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందో లేదో తెలుసుకోండిలా..
మీ క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా చెక్ చేయండి
మీ పాన్ కార్డును ఉపయోగించి ఏదైనా రుణం తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి సులభమైన మార్గం మీ క్రెడిట్ రిపోర్ట్ చూడటం. సిబిల్, ఎక్స్ పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్ఐఎఫ్ హై మార్క్ వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పేరిట తీసుకున్న అన్ని రుణాలు, క్రెడిట్ కార్డుల రికార్డును నిర్వహిస్తాయి. ఆయా సైట్లకు వెళ్లి మీ పాన్, మొబైల్ నంబరు ఇచ్చి క్రెడిట్ రిపోర్ట్ తీసుకోవచ్చు. అది కూడా ఉచితంగా.
మీ క్రెడిట్ రిపోర్టులో ఇవి గమనించండి
మీరు క్రెడిట్ రిపోర్టును సమీక్షిస్తున్నప్పుడు, మీరు దరఖాస్తు చేయని రుణాలు లేదా క్రెడిట్ కార్డులు, తప్పు ఖాతా నంబర్లు, పరిచయం లేని రుణ సంస్థల పేర్లు లేదా మీరు ఆమోదించని కొత్త హార్డ్ ఎంక్వైరీలు ఏమైనా ఉన్నాయేమో చూడండి.మీ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారనడానికి ఇవి సంకేతాలు. మీరు ఇటువంటి అనేక ఎంట్రీలను చూసినట్లయితే, మీ క్రెడిట్ మరింత క్షీణించకుండా వెంటనే చర్యలు తీసుకోండి.
👉 ఇది చదివారా? ఈపీఎఫ్‌వో రూల్స్‌లో మార్పులు.. ఆ కండీషన్లు ఇక ఉండవు
ఫేక్ లోన్ బయటపడితే ఏం చేయాలి?
మీరు మోసపూరిత రుణాన్ని ఎదుర్కొన్నట్లయితే, దానిని రుణ సంస్థ దృష్టికి తీసుకురండి. అలాగే దానిని నివేదించిన క్రెడిట్ బ్యూరోతో చర్చించండి. చాలా వివాదాలను క్రెడిట్ బ్యూరోలు ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. ఐడీ ప్రూఫ్, లోన్కు సంబంధించిన వాస్తవాలు, సంతకం చేసిన అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా, మీ స్థానిక పోలీసు సైబర్ క్రైమ్ సెల్లో ఫిర్యాదు చేయండి. పాన్ దుర్వినియోగం అయినట్లు ఆధారాలను సమర్పించండి.
భవిష్యత్తులో పాన్ దుర్వినియోగం కాకూడదంటే..
అసురక్షిత సైట్లు, యాప్లు లేదా వాట్సాప్ ఫార్వార్డ్లలో మీ పాన్ కార్డు నంబర్ను ఎప్పుడూ పంచుకోవద్దు. బహిరంగంగా షేర్ చేయడం, అనవసరంగా ఎవరికైనా అప్పగించడం చేయొద్దు. మీ పాన్ కార్డు పోతే, రీప్రింట్ కోసం దరఖాస్తు చేయండి. ఆ సమయంలో కొన్ని నెలలు మీ క్రెడిట్ రిపోర్ట్ను సమీక్షించండి. ఫైనాన్షియల్ అకౌంట్ లకు బలమైన పాస్ వర్డ్ లను సెట్ చేసుకోండి. మీ పాన్ తో లింక్ చేసిన లోన్ లేదా క్రెడిట్ అప్లికేషన్ ల కోసం ఎస్ఎంఎస్/ఈమెయిల్ నోటిఫికేషన్ లను ఎనేబుల్ చేయండి.