
ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఈడీఎల్ఐ అంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ నిబంధనల్లో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ ఊరటనిచ్చింది. ఇప్పుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మునుపటిలా కఠినమైన షరతులు ఉండవు. దీని వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు, ముఖ్యంగా విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది.
కనీసం రూ .50,000 బీమా
తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పుడు ఉద్యోగి పీఎఫ్ బ్యాలెన్స్ రూ .50,000 కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఆ ఉద్యోగి మరణించినప్పుడు వారి కుటుంబానికి కనీసం రూ .50,000 బీమా ప్రయోజనం లభిస్తుంది. ఇంతకు ముందు ఈ ప్రయోజనాన్ని పొందడానికి, ఉద్యోగి ఖాతాలో నిర్ణీత పరిమితి వరకు బ్యాలెన్స్ ఉండాలి. కానీ ఇప్పుడా షరతు తొలగించారు.
మరో ముఖ్యమైన మార్పు
కనీస పీఎఫ్ బ్యాలెన్స్ షరతును తొలగించడంతోపాటు ఈ పథకంలో మరో ముఖ్యమైన మార్పు చేశారు. ఈ పథకం కోసం 12 నెలల నిరంతర సర్వీసును లెక్కించేటప్పుడు, ఉద్యోగి కంపెనీలు మారిన సందర్భంలో రెండు ఉద్యోగాల మధ్య 60 రోజుల వరకు గ్యాప్ ఉంటే, దాన్ని ఇకపై విరామంగా పరిగణించరు. అంటే ఉద్యోగి రెండుమూడు ఉద్యోగాలు చేసి, వాటి మధ్య 2 నెలల కంటే తక్కువ విరామం ఉంటే, అప్పుడు అన్ని ఉద్యోగాలు ఒకే (నిరంతర) సర్వీసుగా పరిగణిస్తారు
అంతే కాకుండా పీఎఫ్ పథకంలో సభ్యుడైన ఉద్యోగి చివరి పీఎఫ్ కంట్రిబ్యూషన్ నుండి 6 నెలల్లోపు మరణించిప్పుడు కూడా వారి కుటుంబానికి ఈ పథకం కింద బీమా మొత్తాన్ని ఇస్తారు. అయితే ఆ సమయంలో ఉద్యోగి కంపెనీ రోల్స్లో నమోదై ఉండాలి. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ పథకం ప్రధాన ఉద్దేశం.