హైదరాబాద్‌లో పెరుగుతున్న హౌసింగ్‌ ఇన్వెంటరీ | Housing inventory rising in Hyderabad real estate | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పెరుగుతున్న హౌసింగ్‌ ఇన్వెంటరీ

Nov 8 2025 2:14 PM | Updated on Nov 8 2025 3:52 PM

Housing inventory rising in Hyderabad real estate

ముంబై తర్వాత అత్యధిక ఇన్వెంటరీ మన దగ్గరే..

నగరంలో విక్రయానికి సుమారు లక్ష ఇళ్లు రెడీ

వీటిల్లో సగానికి పైగా పశ్చిమ హైదరాబాద్‌లోనే..

ఎఫ్‌ఎస్‌ఐ, అధిక సరఫరా, ప్రభుత్వ ప్రతికూల విధానాలు వంటి కారణాలనేకం

నాలాలు, చెరువుల సమీపంలో ఇల్లు కొనేందుకు జంకుతున్న కస్టమర్లు

ఆదిభట్లలో ఓ నిర్మాణ సంస్థ రెండేళ్ల క్రితం భారీ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు వంద అపార్ట్‌మెంట్లను కూడా విక్రయించలేకపోయింది. దీంతో నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేసి, ఆఫీసును తాత్కాలికంగా మూసివేశారు. ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులను కూడా భరించలేని పరిస్థితి ఏర్పడటంతో ప్రస్తుతం బిల్డర్‌ కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్నాడు.’ ..ఒకరిద్దరు కాదు హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో చాలా మంది పరిస్థితి ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ)పై ఆంక్షలు లేకపోవడం, అపరిమిత సరఫరా, వడ్డీ రేట్లు, అధిక ధరలు, ప్రభుత్వ ప్రతికూల విధానాలు వంటి రకరకాల కారణాలతో అపార్ట్‌మెంట్ల విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో నగరంలో ఇన్వెంటరీ పెరిగిపోయింది. కస్టమర్ల వాకిన్స్‌ లేకపోవడంతో అపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. సాక్షి, సిటీబ్యూరో

నిర్ధిష్ట కాలంలో మార్కెట్‌లో అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు లేదా అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్లను ఇన్వెంటరీగా పరిగణిస్తుంటారు. ప్రస్తుతం దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలలో ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు 5,61,756 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి. ఇందులో అత్యధికంగా ముంబైలో 1.76 లక్షల యూనిట్లుండగా.. రెండో స్థానంలో హైదరాబాద్‌ నిలిచింది. ప్రస్తుతం నగరంలో 95,331 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఏకంగా లక్షకుపైగా ఇన్వెంటరీ ఉండగా.. ప్రస్తుతం కొంతమేర తగ్గాయి. అయితే దక్షిణాది నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఇన్వెంటరీ అత్యధికంగా ఉంది. బెంగళూరులో 59,244, చెన్నైలో 32,379 ఇన్వెంటరీ యూనిట్లున్నాయి.

పశ్చిమంలోనే ఎక్కువ..

దేశంలో భవనాల ఎత్తుపై ఆంక్షలు లేని ఏకైక నగరం హైదరాబాదే. ఇక్కడ ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ)పై ఆంక్షలు లేకపోవడంతో డెవలపర్లు పోటీపడుతూ హైరైజ్‌ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. ఎకరం, రెండెకరాల స్థలంలోనే రెండు వేలు, మూడు వేల అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారు. దీంతో ప్రతికూల సమయంలో విక్రయాలు లేక అపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉంటున్నాయి. నగరంలో సగానికి పైగా ఇన్వెంటరీ పశ్చిమ హైదరాబాద్‌లోనే ఉంది. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కోకాపేట, నార్సింగి, మణికొండ వంటి ప్రాంతాలలో డిమాండ్‌కు మించి అపార్ట్‌మెంట్ల సరఫరా రావడమే ఇందకు ప్రధాన కారణం.

నాలాలు, చెరువులంటే భయం..

నాలాలు, చెరువులకు సమీపంలో ప్రాజెక్ట్‌ల పేరు వింటేనే కస్టమర్లు జంకుతున్నారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ వంటి ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నా సరే లేక్‌ వ్యూ ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు వెనకడుగేస్తున్నారు. ఎందుకంటే ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌ అంటూ ఏ కారణంతో ఎప్పుడు కూలుస్తారో? అక్రమ నిర్మాణం అంటారోనని గృహ కొనుగోలుదారులు వెనుకడుగేస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందనో, ఆహ్లాదకర వాతావరణం ఉంటుందనో ధైర్యం చేసి అపార్ట్‌మెంట్‌ కొని, బ్యాంక్‌ ఈఎంఐ భారం భరించడం కంటే లేక్‌ వ్యూలకు దూరంగా ఉండటమే ఉత్తమమనే అభిప్రాయం కస్టమర్లలో నెలకొంది. దీంతో గతంలో లేక్‌వ్యూ అంటే ఎగబడి కొన్న జనం.. నేడు విక్రయాలు లేక ప్రాజెక్ట్‌లు విలవిల్లాడుతున్నాయి.

లేఆఫ్‌లు కూడా కారణమే..

స్థిరాస్తి రంగంలో సగానికి పైగా కొనుగోళ్లు ఐటీ సెక్టార్‌ నుంచే జరుగుతుంటాయి. కృత్రిమ మేధస్సు(ఏఐ) శరవేగంగా దూసుకొస్తుండటంతో ఐటీ విభాగంలో లే ఆఫ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రాపర్టీ విక్రయాలు మందగించాయి. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని అయోమయంలో ఐటీ ఉద్యోగులు అపార్ట్‌మెంట్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు.

ఎక్కువ లగ్జరీ ఇళ్ల ఇన్వెంటరీ..

రూ.23 కోట్ల ధర ఉన్న లగ్జరీ ప్రాజెక్ట్‌లలో ఇన్వెంటరీ ఎక్కువగా ఉంది. విలాసవంతమైన ఇళ్ల కొనుగోళ్లకు కస్టమర్లు వేచి చూసే ధోరణిలో ఉండటంతో ఈ విభాగంలో ఇన్వెంటరీ పెరిగింది. కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ పెరగడంతో బిల్డర్లు కూడా లగ్జరీ ప్రాజెక్ట్‌లను ఇబ్బడిముబ్బడిగా ప్రారంభించారు. ఇది కూడా ఇన్వెంటరీ పెరిగేందుకు కారణమే. పెరిగిన భూముల ధరల నేపథ్యంలో రూ.60 లక్షల లోపు ధర ఉండే మధ్య తరగతి ఇళ్లను నిర్మించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిమిత సరఫరా కారణంగా ఈ విభాగంలో ఇన్వెంటరీ ఎక్కువగా లేదు. లగ్జరీ సెగ్మెంట్‌లో డెవలపర్లు పోటీపడి మరీ ప్రాజెక్ట్‌లను చేపట్టడంతో ప్రస్తుతం విక్రయాలు లేక అపార్ట్‌మెంట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement