భారీగా పెరిగిన ఇళ్ల సేల్స్: రూ.50 కోట్లయినా తగ్గేదెలే.. | High Growth in Sales of Expensive Homes: Knight Frank Reports | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన ఇళ్ల సేల్స్: రూ.50 కోట్లయినా తగ్గేదెలే..

Apr 12 2025 3:21 PM | Updated on Apr 12 2025 3:52 PM

High Growth in Sales of Expensive Homes: Knight Frank Reports

ఏడాదిలో 483 శాతం వృద్ధి రేటు నమోదు

హైదరాబాద్‌లో 9,459 గృహాల అమ్మకాలు

నగరంలో 10,661 యూనిట్లు లాంచింగ్‌

40 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు

నైట్‌ఫ్రాంక్‌ ఇండియా - 2025 క్యూ1 అధ్యయనం

ఇంటి బడ్జెట్‌ అంటే లెక్కేలేదు. ఒకటి, రెండు కాదు ఏకంగా రూ.50 కోట్లయినా సునాయాసంగా ఖర్చు చేసేస్తున్నారు. గతంలో ఇల్లు కొనాలంటే బడ్జెట్‌ను ప్రధానంగా పరిగణలోకి తీసుకునేవారు. కానీ, ఇప్పుడు ఎంత ఖరీదైన ఇళ్లయితే అంత గొప్ప. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగానే డెవలపర్లు కూడా ప్రీమియం, అల్ట్రా లగ్జరీ గృహాలను నిర్మిస్తున్నారు. ఏటేటా అందుబాటు గృహాల విక్రయాలు తగ్గుతూ.. అల్ట్రా లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరుగుతుండటమే ఇందుకు ఉదాహరణ. – సాక్షి, సిటీబ్యూరో

ఖరీదైన ఇళ్ల విక్రయాల్లో గణనీయమైన వృద్ధి
ఏటేటా రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్‌ గృహాల విక్రయాలు తగ్గుతున్నాయి. వీటి స్థానంలో రూ.50 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ యూనిట్ల అమ్మకాలు శరవేగంగా పెరుగుతున్నాయి. 2025 జనవరి - మార్చి(క్యూ1)లో అమ్ముడైన ఇళ్లలో అందుబాటు గృహాలు 21,010గా ఉన్నాయి కానీ, గతేడాది క్యూ1తో పోలిస్తే ఈ విభాగంలో సేల్స్‌ 9 శాతం మేర తగ్గాయి. అదే 2025 క్యూ1లో 169 అల్ట్రా లగ్జరీ యూనిట్లు అమ్ముడుపోగా.. గతేడాది క్యూ1తో పోలిస్తే ఏకంగా 483 శాతం వృద్ధి నమోదైంది. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉండే ఇళ్లు 26,832 సేల్‌ కాగా.. 2024 తొలి త్రైమాసికంతో పోలిస్తే 6 శాతం తక్కువ.

ఇక, రూ.కోటి నుంచి రూ.2 కోట్ల ధర ఉండే యూనిట్లు 2 శాతం వృద్ధి రేటుతో 22,230 అమ్ముడుపోయాయి. రూ.2–5 కోట్ల ధర ఉండే ఇళ్లు 28 శాతం వృద్ధితో 13,735 సేల్‌ అయ్యాయి. అలాగే రూ.5–10 కోట్లు ధర ఉండే గృహాలు 82 శాతం పెరుగుదలతో 3,448 సేల్‌ అయ్యాయి. రూ.10–20 కోట్లు ఖరీదు చేసే యూనిట్లు 114 శాతం వృద్ధి రేటుతో 658 అమ్ముడయ్యాయి. అలాగే రూ.20–50 కోట్ల ధర ఉండే ప్రీమియం ఇళ్లు 124 శాతం వృద్ధితో 92 యూనిట్లు అమ్ముడుపోయాయి.

88,274 ఇళ్ల విక్రయాలు..
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 88,274 యూనిట్లు అమ్ముడుపోయాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజా అధ్యయనం వెల్లడించింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ. 2025 క్యూ1లో కొత్తగా 96,309 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. 2024 క్యూ1తో పోలిస్తే ఇది 3 శాతం అధికం. హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 9,459 ఇళ్లు అమ్ముడుపోగా.. 10,661 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి.

ఆఫీసు స్పేస్‌ అధరహో..
దేశంలోని 8 ప్రధాన నగరాలలో 2025 క్యూ1లో 2.82 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 44 శాతం వాటా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లదే(జీసీసీ). 2025 క్యూ1లో జరిగిన లీజుల్లో అత్యధికంగా 1.24 కోట్ల చ.అ. స్థలాలు జీసీసీల ఏర్పాటు కోసమే జరగడం గమనార్హం. ఆఫీసు స్పేస్‌లలో ఐటీ హబ్‌లైన్‌ బెంగళూరు, హైదరాబాద్‌ తీవ్రంగా పోటీపడుతున్నాయి. హైదరాబాద్‌ 2025 క్యూ1లో 40 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 31 శాతం ఎక్కువ. గతేడాది చివరి త్రైమాసికం (క్యూ4)లో 31 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి. నగరంలో గృహాలు, ఆఫీసు స్థలాల అద్దెలు ఏటా 9 శాతం మేర పెరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement