ఐపీవోకు ఏడు కంపెనీలు రెడీ | Here are some upcoming IPOs in India | Sakshi
Sakshi News home page

ఐపీవోకు ఏడు కంపెనీలు రెడీ

May 21 2025 8:24 AM | Updated on May 21 2025 9:52 AM

Here are some upcoming IPOs in India

సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్‌

రూ. 3,000 కోట్ల సమీకరణ

దేశీ స్టాక్‌ మార్కెట్లు ఇటీవల తిరిగి జోరందుకోవడంతో మరోసారి ప్రైమరీ మార్కెట్లకు జోష్‌ వస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో తొలిగా ఏథర్‌ ఎనర్జీ ఐపీవో ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించగా.. సుమారు 10 కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌వైపు సాగుతున్నాయి. బొరానా వీవ్స్, బెల్‌రైజ్‌ ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఇష్యూలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ బాటలో మరో 7 కంపెనీలు సన్నాహాలు ప్రారంభించనున్నాయి. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఈ 7 కంపెనీలు ఉమ్మడిగా రూ.3,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికలు అమలు చేయనున్నాయి. ఇవన్నీ 2024 అక్టోబర్‌– 2025 జనవరి మధ్య కాలంలో సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం..

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలా

గతంలో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలాగా కార్యకలాపాలు నిర్వహించిన క్రెడిలా ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ కాన్ఫిడెన్షియల్‌(గోప్యత) పద్ధతిలో ప్రాస్పెక్టస్‌ను డిసెంబర్‌లో దాఖలు చేసింది. అంటే ప్రాస్పెక్టస్‌ వివరాలు గోప్యంగా ఉంచేందుకు వీలుంటుంది. కంపెనీ ప్రధానంగా విద్యాసంబంధ రుణాలను అందిస్తోంది.

శ్రీ లోటస్‌ డెవలపర్స్‌ అండ్‌ రియల్టీ

బాలీవుడ్‌ స్టార్స్‌తోపాటు.. సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ ఆశిష్‌ కొచాలియాకు పెట్టుబడులున్న శ్రీ లోటస్‌ డెవలపర్స్‌ అండ్‌ రియల్టీ ఐపీవో ద్వారా రూ. 792 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ చేయనుంది. ఐపీవో నిధుల ద్వారా అనుబంధ సంస్థలు రిచ్‌ఫీల్‌ రియల్టీ, ధ్యాన్‌ ప్రాజెక్ట్స్, త్రిక్షా రియల్టీలో పెట్టుబడులు సమకూర్చనుంది. మరికొన్ని నిధులను నిర్మాణంలో ఉన్న అమల్ఫి, ఆర్కేడియన్, వరుణ్‌ ప్రాజెక్టులపై వెచ్చించనుంది.

యూరో ప్రతీక్‌

వాల్‌ ప్యానల్‌ డెకొరేటివ్‌ పరిశ్రమలో కార్యకలాపాలు విస్తరించిన యూరో ప్రతీక్‌ ఐపీవో ద్వారా రూ. 730 కోట్లు అందుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలో కొంతమేర విక్రయానికి ఉంచనున్నారు.  

మైనింగ్, లాజిస్టిక్స్‌  

నాగ్‌పూర్‌ కంపెనీ కాలిబర్‌ మైనింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, మెషీనరీ కొనుగోలు తదితరాలకు వినియోగించనుంది.

జారో ఇన్‌స్టిట్యూట్‌

ఐపీవోలో భాగంగా జారో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ రూ. 170 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్‌ మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 570 కోట్లు అందుకోవాలని చూస్తోంది. నిధులను బ్రాండ్‌ పటిష్టత, ప్రకటనలు, రుణ చెల్లింపులు తదితరాలకు వెచి్చంచనుంది.  

జెన్సన్స్‌ ఇండస్ట్రీస్‌

ఐపీవోలో భాగంగా జెన్సన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్‌ మరో 94.61 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలు.. తదితరాలకు వెచ్చించనుంది.

ఇదీ చదవండి: దానశీలురు ఈ కార్పొరేట్లు

జెమ్‌ ఆరోమాటిక్స్‌

స్పెషాలిటీ ఇన్‌గ్రెడియంట్స్‌ తయారీ ముంబై కంపెనీ జెమ్‌ ఆరోమాటిక్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 89.24 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement