హెల్మెట్ ధరించకపోతే రూ. 500 లేదా రూ. 1000 చలాన్ విధిస్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఒక వ్యక్తి హెల్మెట్ ధరించనందుకు దాదాపు రూ. 21 లక్షల చలాన్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హెల్మెట్ ధరించనందుకు వచ్చిన రూ.20,74,000 చలాన్ చూసి స్కూటర్ రైడర్ అన్మోల్ సింఘాల్ ఒక్కసారిగా షాకయ్యాడు. న్యూ మండి ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో సింఘాల్.. హెల్మెట్ ధరించకపోగా, అతని వద్ద సరైన డాక్యుమెంట్స్ కూడా లేదని పోలీస్ అధికారి పేర్కొన్నారు.
పోలీస్ అధికారి స్కూటర్‌ను స్వాధీనం చేసుకుని.. రూ.20,74,000 జరిమానా విధించాడు. ఇది చూసి షాకయిన రైడర్ ఆ చలాన్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తప్పు తెలుసుకున్న పోలీస్ అధికారి.. ఆ చలాన్ మొత్తాన్ని రూ.4,000 కు సరిచేశారు. దీనిపై ముజఫర్ నగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) అతుల్ చౌబే స్పందించారు.
చలాన్ జారీ చేసిన సబ్-ఇనస్పెక్టర్ చేసిన పొరపాటు వల్ల జరిమానా తప్పుగా జారీ చేశారు. ఈ కేసు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207కు వర్తిస్తుంది. అయితే ఇనస్పెక్టర్ 207 తర్వాత 'ఎంవీ యాక్ట్' అని పేర్కొనడం మర్చిపోయారు. దీంతో రెండూ కలిసిపోయి.. రూ. 2074000గా చలాన్ విధించారు. అయితే రైడర్ చెల్లించాల్సిన ఫైన్ రూ. 4000 మాత్రమే అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనవంతులయ్యే మార్గాలు


