మల్కాజిగిరి: తన ఆటోను అన్యాయంగా స్వా«దీనం చేసుకున్నారనే ఆవేదనతో ఓ ఆటో డ్రైవర్ కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనంగా మారింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ జమ్మిగడ్డ భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన సింగిరెడ్డి మీన్‌రెడ్డి (32) ఆటో డ్రైవర్. మంగళవారం రాత్రి 8.30 గంటలకు కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు కాప్రా పబ్లిక్ స్కూల్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో మద్యం తాగి వాహనాన్ని నడుపుతున్నాడని మీన్‌రెడ్డి ఆటోను స్వా«దీనం చేసుకొని మౌలాలిలో ఉన్న కుషాయిగూడ ట్రాఫిక్ ఠాణాకు తరలించారు. రాత్రి 10.30 గంటల సమయంలో ట్రాఫిక్ ఠాణాకు వచి్చన మీన్‌రెడ్డి తన ఆటో ఇవ్వాలని పోలీసులను కోరారు. అందుకు వారు ససేమిరా అనడంతో బయటికి వచ్చి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్థానికుల సహాయంతో మంటలార్పారు. చికిత్స నిమిత్తం 108లో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మీన్‌రెడ్డి బుధవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
ఘటనపై భిన్న కథనాలు
మీన్‌రెడ్డి ఆత్మహత్యపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. జమ్మిగడ్డకు చెందిన ఓ వ్యక్తి వద్ద మీన్‌రెడ్డి ఆటో అద్దెకు తీసుకొని నడుపుతున్నారని, గత నాలుగు రోజులుగా దానికి అద్దె కట్టడం లేదని సమాచారం. పోలీసులు ఆటోను స్వా«దీనం చేసుకున్న తర్వాత దాని యజమానికి ఫోన్ ద్వారా సమాచారం అందించిన సమయంలో కిరాయి కట్టకపోవడమే కాకుండా ఆటో కూడా పోలీస్‌స్టేషన్‌లో ఉందని.. ఆటో యజమాని మీన్‌రెడ్డిని దూషించడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాదన వినిపిస్తోంది.
ఆటో తీసుకురావడానికి వెళ్లినప్పుడు పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతోనే మీన్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే అసలు వాస్తవం తెలుస్తుందంటున్నారు. ఈ విషయమై కుషాయిగూడ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరగా.. నిబంధనల మేరకే వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చామన్నారు. మీన్‌రెడ్డి వచ్చి అడిగితే వేరే ఎవరినైనా తీసుకొని వస్తే ఆటో అప్పగిస్తామని చెప్పినట్లు వివరించారు.


