అమెరికా ‘లేబర్‌’ షాక్‌: ఇన్ఫోసిస్‌ రియాక్షన్‌ ఇదే.. | Green Card Freeze Infosys US PERM Suspension | Sakshi
Sakshi News home page

అమెరికా ‘లేబర్‌’ షాక్‌: ఇన్ఫోసిస్‌ రియాక్షన్‌ ఇదే..

Oct 11 2026 11:54 AM | Updated on Oct 11 2026 12:41 PM

Green Card Freeze Infosys US PERM Suspension

అమెరికా కార్మిక శాఖ (డీఓఎల్‌) శాశ్వత లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ (పర్మ్‌) కింద కొత్త, పెండింగ్‌ దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను నిలిపివేయడంపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ స్పందించింది. ఈ నిర్ణయం వల్ల తమ సంస్థపై గణనీయమైన ప్రభావం ఉంటుందని భావించడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ సస్పెన్షన్‌ కొన్ని కంపెనీలకు వర్తిస్తుందని పేర్కొన్న ఇన్ఫోసిస్‌.. అమెరికా అధికారులతో సంప్రదింపులు జరిపేందుకు, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

అమెరికాలో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం

అమెరికా కార్మిక శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇన్ఫోసిస్‌ పేర్కొంది. అమెరికా అంతటా స్థానిక ఉద్యోగ నియామకాలు, సాంకేతిక అభివృద్ధి, ఆవిష్కరణల కేంద్రాల ఏర్పాటులో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది. అమెరికాలోని తమ ఉద్యోగులు, క్లయింట్లు, స్థానిక సమాజాల పట్ల సంస్థ కట్టుబడి ఉందని తెలిపింది. అక్కడ అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను పూర్తిస్థాయిలో పాటిస్తామని స్పష్టం చేసింది. అవసరమైతే నిబంధనలకు అనుగుణంగా మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పేర్కొంది.

వలస నిబంధనల మార్పులపై ఆందోళన

అమెరికాలో వలస నిబంధనల్లో మార్పులు తమ వ్యాపార అంచనాలపై ప్రభావం చూపే అంశాల్లో ఒకటని ఇన్ఫోసిస్‌ తెలిపింది. ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం పెరుగుతున్న పోటీ, సిబ్బందిని నియమించుకోవడం, కొనసాగించడం, వేతనాల పెరుగుదల, ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం వంటి అంశాలను కూడా ప్రస్తావించింది. ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, సాంకేతిక మార్పులు, సైబర్‌ భద్రతా సమస్యలు, పెండింగ్‌ కేసులు, అమెరికా ప్రభుత్వ దర్యాప్తులు, ప్రస్తుత-భవిష్యత్‌ సుంకాలు సైతం సంస్థ వ్యాపారంపై ప్రభావం చూపే ప్రమాదాలుగా పేర్కొంది.

పూర్తి వివరాలు వెల్లడించని కంపెనీ

లేబర్‌ సర్టిఫికేషన్‌ దరఖాస్తుల నిలిపివేతకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు ప్రభావితమయ్యాయి, ఈ నిర్ణయం ఎంతకాలం కొనసాగుతుంది, దీని వెనుక కారణాలేమిటనే వివరాలను ఇన్ఫోసిస్‌ వెల్లడించలేదు. మరోవైపు, ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రభావంపై సంస్థ చేసిన అంచనాలు భవిష్యత్తుకు సంబంధించినవని, వాటిలో అనిశ్చితులు ఉన్నాయని ఫైలింగ్‌లో హెచ్చరించింది. వాస్తవ ఫలితాలు ప్రస్తుత అంచనాలకు భిన్నంగా ఉండవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికతో పాటు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు సమర్పించిన ఇతర పత్రాలను పరిశీలించాలని పెట్టుబడిదారులకు సూచించింది.

పర్మ్‌ అంటే ఏమిటి?

అమెరికాలో శాశ్వతంగా పనిచేయడానికి విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌ కార్డు (Green Card) ప్రక్రియలో ఉపయోగపడే ఉద్యోగ ఆధారిత మార్గాల్లో పర్మ్‌ ఒకటి. ఈ ప్రక్రియలో సాధారణంగా సంబంధిత ఉద్యోగానికి అర్హులైన అమెరికా కార్మికులు అందుబాటులో లేరని, విదేశీ ఉద్యోగిని నియమించడం వల్ల స్థానిక కార్మికుల వేతనాలు, పని పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఉండదని యజమాని నిరూపించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేషన్‌ ప్రక్రియ నిలిచిపోవడం వల్ల కొత్త దరఖాస్తులతో పాటు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, ఇన్ఫోసిస్‌ విషయంలో ఎంతమేర ప్రభావం ఉంటుందనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.

ఇదీ చదవండి: ఐటీ జాబ్‌ వదిలి.. ఐదింతలు సంపాదన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement